Latest News

liquor scam:లిక్కర్ స్కామ్‌లో విజయసాయిరెడ్డి సహకారం వెనుకున్న ఆ ఆఫరేంటి..?

liquor scam: రెండుసార్లు సిట్ విచారణకు హాజరైన విజయసాయి, ఇప్పుడు మూడోసారి హాజరవుతారని అనుకున్నారు.

liquor scam: ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం రోజుకోరకమైన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కొన్ని అరెస్టులు జరిగాయి. ఈ పరిణామాల మధ్య, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి((vijayasaireddy) మళ్లీ వార్తల్లో నిలిచారు. గతంలో రెండుసార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరైన ఆయన, ఇప్పుడు మూడోసారి హాజరవుతారని అనుకున్నారు. కానీ తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో సిట్ విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల్లో తప్పకుండా వస్తానని వివరణ ఇచ్చారు.

liquor scam

అయితే, విజయసాయిరెడ్డి ఈరోజు వ్యక్తిగత కారణాలతో డుమ్మా కొట్టినా..రేపో, మాపో అయినా విచారణకు హాజరవ్వాల్సిందే.నిజానికి సిట్(SIT) విచారణలు కేవలం ఒక సాధారణ ప్రక్రియ కాదు, దీని చుట్టూ అనేక రాజకీయ మలుపులు, ఊహాగానాలు అలుముకున్నాయి.

విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వెళ్తారా?

కొద్ది నెలల క్రితం వైసీపీ(YCP)కి గుడ్‌బై చెప్పిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మళ్లీ పార్టీలోకి తిరిగి వెళ్తారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న సమయంలో.. ఆయన సిట్ విచారణకు హాజరవుతారన్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. పార్టీని వీడే సమయంలో, కూటమి కేసులు పెడుతుందనే భయంతోనే తాను బయటకు వచ్చానని చెబుతూ వార్తలు వినిపించాయి.

అయితే, విజయసాయిరెడ్డి మాత్రం జగన్ చుట్టూ ఉన్న కోటరి తీరు నచ్చకనే పార్టీకి గుడ్‌బై చెప్పానని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డిపై ఒక్క ఆరోపణ కూడా చేయను, ఆయనకు నష్టం చేకూర్చే పనిని చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. కానీ, ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఆయన విచారణకు హాజరవడం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

రాజ్ కసిరెడ్డి వైపు వేలు..
గతంలో ఓ కేసు విచారణకు హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కీలక మలుపు తిప్పాయి. వైసీపీ (YCP)హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి ముమ్మాటికీ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ సాయిరెడ్డి బాహాటంగా ఆరోపించడం పెద్ద సెన్షేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు, ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు తాను ఇస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే సిట్ మరింత దూకుడు పెంచి, అరెస్టులను ప్రారంభించింది.

ఈ కేసులో విజయసాయిరెడ్డి పేరు మొదట్లో ఏ5 నిందితుడిగా చేర్చినా కూడా ప్రస్తుత విచారణకు ఆయనను సాక్షిగా మాత్రమే పిలిచినట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా అనేక చర్చలకు దారితీసింది. రాజకీయంగా ఆయన మనసు మార్చుకున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో, సిట్ ఎదుట సాక్షిగా హాజరుకావడం వైసీపీలో కలవరం సృష్టిస్తోంది.

సాయిరెడ్డి సహకారం వెనుక.. ఆఫర్?
ఈ ఏడాది జనవరిలో జగన్ విదేశాల్లో ఉండగా, విజయసాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. కాకినాడ సిపోర్టు వాటాల బదిలీ కేసులో విచారణకు హాజరైనప్పుడు చేసిన వ్యాఖ్యల తర్వాతే మద్యం కుంభకోణం కేసులో సిట్ వేగం పుంజుకుంది. విజయసాయిరెడ్డి దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని, అందుకే ఇంతవరకు ఆయన అరెస్టు జరగలేదని తెలుస్తోంది

అయితే, విజయసాయిరెడ్డి సిట్‌కు ఒక మంచి ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కుంభకోణంలో జరిగిన అన్ని విషయాలను బయటపెడతానని ఆయన సిట్‌కు హామీ ఇచ్చారట. గత రెండు విచారణల్లోనూ ఆయన ఎన్నో కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సరైన హామీ లభిస్తే, ఈ కుంభకోణం గుట్టు పూర్తిగా విప్పుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, మద్యం కుంభకోణంలో మరికొందరు కీలక నేతలు ఇరుక్కునే ప్రమాదం ఉంది.

మొత్తంగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో..విజయసాయిరెడ్డి ముందు ముందు ఎలాంటి ఆధారాలు బయటపెడతారు? జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేస్తారా? ఆయన మౌనం వీడితే ఇంకెన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి? ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button