ICC Women’s World Cup: మన శివంగులు గర్జిస్తారా? కివీస్ తో డూ ఆర్ డై మ్యాచ్
ICC Women's World Cup: ఈ క్రమంలో గురువారం న్యూజిలాండ్ తో తలపడబోతోంది. నవీ ముంబై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకూ డూ ఆర్ డైగానే మారింది.

ICC Women’s World Cup
మహిళల వన్డే ప్రపంచకప్(World Cup) ను వరుస విజయాలతో ఆరంభించిన భారత్ తర్వాత చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు ఓటములతో సెమీస్ రేసులో వెనుకబడింది. గెలవాల్సిన మ్యాచ్ లలో ఓడిపోయి చేజేతులూ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మార్చుకుంది. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచ్(World Cup) లలో గెలిస్తే నేరుగా సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది.
ఈ క్రమంలో గురువారం న్యూజిలాండ్ తో తలపడబోతోంది. నవీ ముంబై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకూ డూ ఆర్ డైగానే మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 2 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ కూడా 4 పాయింట్లతో ఐదో ప్లేస్ లో ఉంది. కానీ రన్ రేట్ పరంగా భారత్ మెరుగ్గా ఉంది. సెమీస్ రేసులో నిలవాలంటే కివీస్ పై విజయం తప్పనిసరి. ఈ మ్యాచ్ లో గెలిస్తే తర్వాత బంగ్లాను ఓడించడం భారత్ కు పెద్ద కష్టం కాదు.
ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే మాత్రం సెమీస్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారతాయి. ఇతర జట్ల ఫలితాలపై భారత్ సెమీస్ బెర్త్ ఆధారపడి ఉంటుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ కివీస్ ను ఓడించాల్సిందే. ఈ(World Cup) టోర్నీ ఆరంభంలో పెద్దగా రాణించని స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. గత మ్యాచ్ లో ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు.

అయితే కీలక సమయంలో ఔట్ కావడంతో భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. అటు ప్రతీకా రావల్ కూడా ఫామ్ అందుకుంటే తిరుగుండదు. బ్యాటింగ్ ఆర్డర్ లో దీప్తి శర్మతో పాటు రిఛా ఘోష్ కూడా కీలకం కానున్నారు. ఇదిలా ఉంటే ఈ వరల్డ్ కప్ లో భారత్ తుది జట్టు కూర్పు సవాల్ గా మారింది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగినప్పుడు ఓటమి ఎదురవడంతో గత మ్యాచ్ లో ఆరో బౌలర్ ను తీసుకుంది.
దీని కోసం జెమీమా రోడ్రిగ్స్ ను తప్పించాల్సి వచ్చింది. అదే సమయంలో ఛేజింగ్ చేస్తుండగా ఒక బ్యాటర్ లేని లోటు స్పష్టంగా కనిపించి గెలుపు ముంగిట బోల్తా పడింది. మరి కివీస్ తో మ్యాచ్ కోసం ఆరుగురు బౌలర్ల వ్యూహంతోనే ఆడుతుందా లేదా అనేది చూడాలి. అలాగే డెత్ ఓవర్స్ లో మన బౌలింగ్ మరింత మెరుగు పడాల్సిన అవసరం కనిపిస్తోంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి పేలవమైన డెత్ బౌలింగే కారణం.
ఇదిలా ఉంటే న్యూజిలాండ్ ది కూడా చావోరేవో పరిస్థితే. దీంతో భారత్ ను ఓడించి సెమీస్ రేసులో ముందుకెళ్ళాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న నవీ ముంబై పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంచనా. అదే సమయంలో మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపించే అవకాశముంది.