Naveen Yadav: ఈసారి కూడా గెలుపు కష్టమేనా ? నవీన్ కు మైనస్ గా రౌడీ బ్యాక్ గ్రౌండ్
Naveen Yadav: గతంలో పోటీచేసినప్పుడు ఓడిపోవడానికి నవీన్ రౌడీ బ్యాక్ గ్రౌండే కారణమని స్థానికులు చెబుతుంటారు. ఈ సారి మాత్రం అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నాడు.
Naveen Yadav
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏ ఎన్నికల్లో అయినా ఓటర్లు చూసేది అభ్యర్థి బ్యాక్ గ్రౌండ్ కూడా.. ప్రస్తుతం ఈ బ్యాక్ గ్రౌండ్ విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు షాక్ తగిలే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. అతని కుటుంబానికి ఉన్న రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు నవీన్ యాదవ్ కు మైనస్ గా మారే అవకాశముందని భావిస్తున్నారు. అతని ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ , బీజేపీ నవీన్ యాదవ్(Naveen Yadav) రౌడీ బ్యాక్ గ్రౌండ్ నే ప్రచారంలో తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి పల్లాల నవీన్ యాదవ్(Naveen Yadav) తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై గతంలో రౌడీ షీట్ ఉంది. పలు భూ వివాదాల్లో నవీన్ యాదవ్ కుటుంబం జోక్యం చేసుకుందని, భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఆరోపణల కారణంగానే నవీన్ కి సీట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పది సార్లు ఆలోచించింది. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కు ఈ కారణంగానే టికెట్ దక్కలేదు.

అయితే తాను అమెరికాలో ఉద్యోగం చేసినట్టు, అవన్నీ వదిలేసి ప్రజా సేవ చేయడానికి తిరిగి స్వదేశం వచ్చానని నవీన్ యాదవ్ చెబుతున్నారు. కానీ వాళ్ళ కుటుంబనేపథ్యం తెలిసిన వాళ్ళు ఈ మాటలు నమ్మడం లేదు. నవీన్ కొన్నేళ్లుగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. గతంలో తన తండ్రి కబ్జా చేసిన భూములన్నీ ఆ తర్వాత రెగ్యులర్ చేయించి వాటి ద్వారా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ బీఆర్ఎస్, బీజేపీలకు అస్త్రాలుగా మారాయి. నవీన్ యాదవ్ గతాన్ని తవ్వుతూ రౌడీ షీటర్ కు ఓటేస్తారా అంటూ ప్రచారం సాగిస్తున్నాయి.
అదే సమయంలో నవీన్ యాదవ్(Naveen Yadav) ప్రధాన ప్రత్యర్థి మాగంటి గోపీనాథ్ భార్య సునీత కి ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఆమెపై ఆరోపణలు చేసేందుకు నవీన్ కు అవకాశం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. 2014లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2018 లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
గతంలో పోటీచేసినప్పుడు ఓడిపోవడానికి నవీన్ రౌడీ బ్యాక్ గ్రౌండే కారణమని స్థానికులు చెబుతుంటారు. ఈ సారి మాత్రం అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నాడు. రేవంత్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఉపఎన్నికలో పార్టీనే తనను గెలిపిస్తుందని నవీన్ నమ్ముతున్నా ప్రత్యర్థి పార్టీలు మాత్రం అతని రౌడీ బ్రాక్ గ్రౌండ్ నే ఎక్కువ ప్రచారం చేసి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.



