Just PoliticalJust TelanganaLatest News

BRS: అధికారం లేకుంటే అంతే మరి.. పడిపోయిన బీఆర్ఎస్ విరాళాలు

BRS: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈసీకి ఇచ్చిన నివేదికలో ఈ వివరాలు తెలిసాయి.

BRS

రాజకీయాల్లో అధికారం ఉంటేనే గుర్తింపు… అధికారం ఉంటేనే గౌరవం.. అధికారం ఉంటేనే ఫాలోయింగ్…పార్టీని నడిపించే వ్యక్తి ఎంత గొప్పవాడైనా చేతిలో అధికారం లేకుంటే మాత్రం పట్టించుకునే వారే ఉండరు.. ఏదో కొందరు కార్యకర్తలు నాయకుడి మీద అభిమానంతో ఉన్నా.. అప్పటి వరకూ సార్ సార్ అంటూ తిరిగిన బడావ్యక్తులు మాత్రం కనుచూపు మేర కూడా కనబడరు. తాజాగా బీఆర్ఎస్(BRS) పార్టీలో ఈ విషయం మరోసారి రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం..

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల దెబ్బకు గులాబీ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. దీనికి తోడు ఆ పార్టీ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వెళ్ళిపోవడం, పలువురు నాయకులు ఆమె కంటే ముందే పార్టీని వీడడం ఇలాంటి పరిణామాలతో కారు పార్టీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఆ పార్టీకి వచ్చిన తాజా విరాళాలతోనే ఈ విషయం పూర్తిగా తేటతెల్లమయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయ విరాళాలు దారుణంగా పడిపోయాయి.

BRS
BRS

2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఈసీకి ఇచ్చిన నివేదికలో ఈ వివరాలు తెలిసాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్(BRS) కు కేవలం రూ. 15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ఈ నిధులలో ఎక్కువ భాగం ట్రస్టుల ద్వారానే వచ్చినట్టు తెలుస్తోంది. ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.10 కోట్లు, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.5 కోట్లు విరాళాలుగా అందాయి. అయితే వ్యక్తిగత విరాళాలు చాలా తక్కువగా నమోదైనట్టు నివేదిక ద్వారా తెలుస్తోంది. ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఇచ్చిన రూ.8.79 లక్షలే పెద్ద మొత్తంగా ఉంది. తర్వాత మహమ్మద్‌ అజార్‌ రూ.29 వేలు విరాళంగా అందజేశారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాలు ఏకంగా 97 శాతం పడిపోయాయి.

2023-24 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్‌(BRS)కు ఏకంగా రూ.580.52 కోట్లు విరాళాలుగా వచ్చాయి. దీనిలో అప్పుడు ప్రధానంగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారానే రూ.495.52 కోట్లు అందాయి. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్టీ అత్యధికంగా రూ683.06 కోట్ల విరాళాలు అందుకుంది. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రూ.529 కోట్లు, ప్రుడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.90 కోట్లు, వివిధ వ్యక్తులు, ఇతర సంస్థల ద్వారా రూ.64.03 కోట్లు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అధికారం కోల్పోవడం, కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతోనే విరాళాలు ఇంతలా పడిపోయినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విరాళాల తగ్గిపోవడం పార్టీ భవిష్యత్ కార్యక్రమాలతో పాటు ఎన్నికల వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button