Rajinikanth Times: రజనీకాంత్ టైమ్స్..బస్ కండక్టర్ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు
Rajinikanth Times: హిందుస్తాన్ టైమ్స్ తమ ఫ్రంట్‌పేజీలోని పేరు (మాస్ట్‌హెడ్)ను మార్చి, 'రజనీకాంత్ టైమ్స్'గా ప్రచురించింది.
Rajinikanth Times
చాలామంది నటులు ఉంటారు. కానీ ఆ నటుల్లో కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల హృదయాన్ని చిరస్థాయిగా నిలుపుకోగలరు. అలాంటి వారిలో తలైవా రజనీకాంత్ ఒకరు. ఇప్పుడు ఇదే విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది హిందుస్తాన్ టైమ్స్.
రజనీకాంత్ ( Rajinikanth Times-శివాజీ రావు గైక్వాడ్) బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో (BTS) ఒక సాధారణ బస్ కండక్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన టిక్కెట్లు ఇచ్చే విధానం, నాణేలను గాల్లోకి ఎగరేసే స్టైల్ అప్పుడే ఆయనలోని ప్రత్యేకతను చాటి చెప్పాయంటారు ఆయన ఫ్రెండ్స్. నటనపై ఇంట్రస్టుతో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.
1975లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ కంట్లో పడటంతో, ఆయన ద్వారా అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో రజనీకాంత్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా చెబుతూ, “బాలచందర్ లేకపోతే రజనీకాంత్ లేడు” అని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు రజనీకాంత్ ఐదు దశాబ్దాలకు పైగా (50 సంవత్సరాలు) చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నారు. ఆయన స్టైల్ , ఎనర్జీ, మాస్ అప్పీల్‌కు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైన ప్రేక్ష కాదరణ ఉంది.

ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుస్తారు.
రజనీకాంత్(Rajinikanth Times) సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందుస్తాన్ టైమ్స్’ ఒక చారిత్రాత్మక బహుమతిని అందించింది.
హిందుస్తాన్ టైమ్స్ తమ ఫ్రంట్‌పేజీలోని పేరు (మాస్ట్‌హెడ్)ను మార్చి, ఆ రోజు పత్రికను ‘రజనీకాంత్ టైమ్స్’గా ప్రచురించింది.
ఈ పత్రిక దాదాపు 100 ఏళ్ల చరిత్రలో, ఒకే వ్యక్తికి, అది కూడా ఒక సినిమా నటుడికి తమ పూర్తి మొదటి పేజీని అంకితం చేయడం ,మాస్ట్‌హెడ్‌ను మార్చడం చరిత్రలోనే మొదటిసారి.
ఈ ప్రత్యేక సంచికలో మొదటి పేజీ మొత్తం రజనీకాంత్(Rajinikanth Times) ఫోటోలు, ఆయన ఘనమైన ప్రస్థానం గురించిన ప్రత్యేక కథనాలతో నిండిపోయింది. ఇది కేవలం సినిమా పరిశ్రమకే కాకుండా, భారతీయ సంస్కృతి, జ్ఞాపకాలు, ఆధునిక పురాణాలలో రజనీకాంత్ స్థానాన్ని గుర్తిస్తూ ఇచ్చిన ఓ అరుదైన బహుమతి.
ఈ స్పెషల్ గిఫ్టును హిందుస్తాన్ టైమ్స్ మరియు OTTప్లే (OTTplay) సంస్థలు కలిసి అందించాయి. ఫ్రంట్‌పేజీతో పాటు, OTTప్లే ద్వారా రజనీకాంత్ పాత క్లాసిక్స్ నుండి సరికొత్త బ్లాక్‌బస్టర్‌ల వరకు ఆయన సినిమాలు చూసేందుకు వీలు కల్పించాయి. ఫీవర్ ఎఫ్.ఎం. (Fever FM) ద్వారా రేడియోలో కూడా ఈ వేడుకను విస్తరించారు.
హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఒక వ్యక్తికి తమ మొదటి పేజీని పూర్తిగా అంకితం చేయడం, పత్రిక పేరును మార్చడం ద్వారా, రజనీకాంత్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక దృగ్విషయం (Cultural Phenomenon) అని స్పష్టం చేసింది. ఈ గౌరవం ఇండియన్ మీడియా చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది.




One Comment