Pawan Kalyan: మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..పూల వర్షంతో స్వాగతం పలికిన గ్రామస్తులు
Pawan Kalyan: ఇచ్చిన మాట ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపుకి సంబంధించిన పత్రాలు సోమవారం పవన్ కళ్యాణ్ ఆలయ అధికారులకు అందజేశారు.
Pawan Kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా, ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

అన్నట్లుగానే ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. దీనికి అనుగుణంగా ఆలయ అభివృద్ధికి రూ. 8.7 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు.

సోమవారం ఐ.ఎస్.జగన్నాథపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రూ. 3.5 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షణ మండపానికి, రూ. 3.7 కోట్ల పంచాయతీరాజ్ రోడ్ అసెట్స్ నిధులతో ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాలు ఆవిష్కరించారు. దీంతో పాటు ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ సహాయంతో పొంగుటూరు, లక్కవరం మధ్య గోతుల మయంగా ఉన్న రహదారికి రూ.1.5 కోట్లతో మరమ్మతులు చేయించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రహదారిని పరిశీలించారు.

శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పవన్ కళ్యాణ్ గత పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి భూమి ఇప్పిస్తానని . ఇచ్చిన మాట ప్రకారం 30 ఎకరాల భూ కేటాయింపుకి సంబంధించిన పత్రాలు సోమవారం పవన్ కళ్యాణ్ ఆలయ అధికారులకు అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలియజేశారు.

అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఐ.ఎస్. జగన్నాథపురం వచ్చిన పవన్ కళ్యాణ్ కు ప్రజలు దారి పొడవునా పూల వర్షంతో స్వాగతం పలికారు. రాజవరం, యర్రంపేట, గవరవరం, ఐ.ఎస్. జగన్నాథపురం గ్రామాల్లో ఆడపడుచులు పవన్ కళ్యాణ్ కు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను తెలియచేసేందుకు ముందుకు రాగా వారి వద్దకు వెళ్ళి వినతి పత్రాలు స్వీకరించి, వివరాలు తెలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలను ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు.



