Just TelanganaLatest News

Tiffin: కూలీలు, వలస కార్మికులకు వరం..ఒక్క రూపాయికే టిఫిన్

Tiffin: రైల్వే స్టేషన్ నీడలో, వచ్చీపోయే ఎందరో ప్రయాణికులు, స్థానికంగా ఉండే పేదలు, దినసరి కూలీలు ఒక్క రూపాయికే టిఫిన్ సేవను వినియోగించుకుంటున్నారు.

Tiffin

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో రోజూ ఉదయం ఒక పెద్ద క్యూ కనిపిస్తోంది. అది సినిమా టికెట్ల కోసం కాదు, మరే ఇతర వస్తువుల కోసమో కాదు. కేవలం ఒక్క రూపాయికే కడుపు నిండా అల్పాహారం(Tiffin) పెడుతున్న ఒక ఆదర్శవంతుడి పట్టెడు అన్నం కోసం ఎదురుచూస్తున్నవారిదే ఆ క్యూ. తాను కష్టపడుతూ, ఆకలితో ఉన్న వందలాది మంది పేద ప్రజల పొట్ట నింపుతున్న ఆ మహోన్నత వ్యక్తి జార్జ్ రాకేష్ బాబు.

జార్జ్ రాకేష్ బాబు కేవలం ఒక్క రూపాయికి పేద ప్రజలకు తాజా అల్పాహారం(Tiffin) అందిస్తున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన ‘కరుణ కిచెన్’ చొరవ ద్వారా నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్ నీడలో, వచ్చీపోయే ఎందరో ప్రయాణికులు, స్థానికంగా ఉండే పేదలు, దినసరి కూలీలు ఈ సేవను వినియోగించుకుంటున్నారు.

ఈ అల్పాహార(Tiffin) సేవ రెండు నెలల క్రితం మనోహర్ థియేటర్ సమీపంలో ప్రారంభమైంది. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సుమారు 250 మందికి ఈ సేవలు అందుతున్నాయి.

ప్రతిరోజు ఒకే రకమైన అల్పాహారం కాకుండా, మెనూ మారుతుంది. ఉప్మా , సాంబార్, లేదా గుడ్డు, అరటిపండు బ్రెడ్ వంటి పోషక విలువలు ఉన్న ఆహారంతో పాటు టీ కూడా కేవలం ఒక రూపాయికే అందిస్తున్నారు.

Tiffin
Tiffin

ఈ సేవ కోసం ముందుగా టోకెన్లు అందిస్తారు. ఆ టోకెన్లు ఉన్నవారికే కాకుండా, ఆ ఒక్క రూపాయి కూడా చెల్లించలేని పేదవారు ఎవరైనా ఉన్నా, వారు సంకోచం లేకుండా వారికి ఆహారం వడ్డిస్తారు. గత సంవత్సరం రాకేష్ బాబు కేవలం రూపాయికే మధ్యాహ్న భోజన సేవను ప్రారంభించారు. అది ఇప్పుడు దాదాపు 350 మందికి సేవలు అందిస్తోంది. వలస కార్మికులు, రోజువారీ కూలీ కార్మికులు, ఆటో-రిక్షా డ్రైవర్లు వంటి అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

రాకేష్ బాబు మాట్లాడుతూ, “అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. ఆర్థిక పరిమితులు లేదా పని ఒత్తిడి కారణంగా చాలా మంది దీనిని దాటవేస్తుంటారు. అందుకే వేలాది మంది వలస కార్మికులు ప్రయాణించే సికింద్రాబాద్‌లో అల్పాహారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. పేద ప్రజలు కడుపు నిండా తినాలనే ఉద్దేశ్యంతోనే అందరి నుంచి ఒక రూపాయి మాత్రమే తీసుకుంటాను” అని తెలిపారు.

ఈ గొప్ప కార్యక్రమం ఆయన సొంత పొదుపుతో మొదలైనా, త్వరలోనే ఇది సమాజంలోని దయగల వ్యక్తుల మద్దతు పొందింది. చాలా మంది దాతలు రూ.10 నుంచి రూ. 100 వరకు విరాళంగా ఇస్తున్నారు. కొందరు డబ్బు రూపేణా కాకుండా వంట సామాగ్రిని కూడా విరాళంగా ఇస్తున్నారు. రాకేష్ బాబు ఈ చొరవను నగరంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button