Just Andhra PradeshLatest News

Scrubtyphus: ఏపీలో చాపకింద నీరులా ‘స్క్రబ్ టైఫస్’.. 1592 కేసులతో ప్రభుత్వం హై అలర్ట్

Scrubtyphus:రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,592 'స్క్రబ్ టైఫస్' కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు రికార్డయ్యాయి.

Scrubtyphus

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్(Scrubtyphus) వ్యాధి వ్యాప్తి ఆందోళన కలిగిస్తుండటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఈ వ్యాధి నియంత్రణకు గాను, దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ (Task Force) ను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఈ వ్యాధిని తేలిగ్గా తీసుకోవడం లేదనే స్పష్టమైన సందేశం పంపుతోంది.

సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..అపరిశుభ్రతే సమాజంలో అతిపెద్ద జబ్బు అని, ఇదే అనేక వ్యాధులకు మూలకారణమని పేర్కొన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో విస్తృత చైతన్యం (Awareness) కల్పించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు గత ఏడాదితో పోలిస్తే 48 శాతం తగ్గినా కూడా, పరిశుభ్రత పెంచడం ద్వారా వాటిని సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికార యంత్రాంగాన్ని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,592 ‘స్క్రబ్ టైఫస్(Scrubtyphus)’ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు రికార్డయ్యాయి.అయితే ఈ వ్యాధితో మరణించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు నివేదించారు. అనుమానిత మరణాలుగా నమోదైన 9 కేసులను పరిశీలించగా, అవి ప్రధానంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు మరియు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌ కారణంగానే జరిగినట్లు తేలింది.

Scrubtyphus
Scrubtyphus

స్క్రబ్ టైఫస్ అనేది ఓరింటియా సుట్సుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా పొలాల్లో, అడవుల్లో, లేదా చెత్తాచెదారంలో ఉండే ‘చిగ్గర్ మైట్’ (Chigger Mite) అనే చిన్న కీటకం కాటు ద్వారా మనుషులకు వస్తుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయకపోతే, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు తీవ్రమై, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు వంటి కీలక అవయవాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీనిని తేలిగ్గా తీసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ కూడా వ్యవసాయం, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రం కావడం వల్ల, వర్షాలు మరియు అపరిశుభ్రత ఉన్న ప్రాంతాలలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సరిహద్దుల్లోని జిల్లాలలో ఎప్పుడైనా వ్యాప్తి జరగవచ్చు. తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా నివారణ చర్యలను, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ టాస్క్‌ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా, పటిష్టమైన కార్యాచరణను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button