Meesho: మీషో షేర్ల సునామీ ..వారం రోజుల్లోనే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్ ఎందుకయింది?
Meesho: ప్రస్తుతం మీషో మార్కెట్ విలువ ఒక లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటేయడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Meesho
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతో సాగుతున్నా, కొన్ని షేర్లు మాత్రం ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంలా మారుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం మీషో(Meesho) లిమిటెడ్ తన దూకుడును ప్రదర్శిస్తోంది.
కేవలం ఏడు ట్రేడింగ్ సెషన్లలోనే మీషో షేర్ ధర తన ఇష్యూ ధర 111 రూపాయల నుంచి ఏకంగా 233 రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 110 శాతం పెరిగి ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు చేసింది. ప్రస్తుతం మీషో (Meesho)మార్కెట్ విలువ ఒక లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటేయడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ ఈ స్టాక్ పట్ల చాలా సానుకూలంగా ఉంది. మీషో అనుసరిస్తున్న తక్కువ ఆస్తుల బిజినెస్ మోడల్ వల్ల కంపెనీలో నగదు ప్రవాహం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.

భవిష్యత్తులో ఈ కంపెనీ కస్టమర్ల సంఖ్య 199 మిలియన్ల నుంచి 518 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. అలాగే ఆర్డర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని, దీనివల్ల కంపెనీ ఆదాయం ఏటా 30 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అందుకే మార్కెట్ పడిపోతున్నా మీషో షేర్లు మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
మీషో స్టాక్ డిసెంబర్ 10న మార్కెట్ లోకి వచ్చినప్పుడు 53 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యింది. ఆ తర్వాత స్వల్ప క్షీణత కనిపించినా, మళ్లీ పుంజుకుని వరుస లాభాలతో దూసుకెళ్తోంది. ఈ-కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తూనే, ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి , చిన్న పట్టణాల ప్రజలను టార్గెట్ చేస్తూ మీషో చేస్తున్న వ్యాపారం ఈ వృద్ధికి ప్రధాన కారణమని చెప్పొచ్చు.



