Latest News

Ippatam: ఇప్పటం గల్లీలో డిప్యూటీ సీఎం..

Ippatam: పార్టీ అధ్యక్షుడి హోదాలో తప్పకుండా వస్తా అని ఇచ్చిన మాటను, ఈనాడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే మర్చిపోకుండా, ఆమె ఇంటి గడప తొక్కి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.

Ippatam

రాజకీయాల్లో మాట ఇవ్వడం చాలా తేలిక, కానీ ఆ మాటను నిలబెట్టుకోవడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా అధికారం చేతికి వచ్చాక పాత జ్ఞాపకాలను, పాత బాధితులను మర్చిపోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నమని నిరూపించారు.

2022లో వైఎస్సార్సీపీ హయాంలో ఇప్పటం(Ippatam) గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేసినప్పుడు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కల్యాణ్ అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. ఆ సమయంలో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు తన గోడు వెళ్లబోసుకుంటూ, ఆయన చేతులు పట్టుకుని “నువ్వు గెలిచాక మళ్లీ మా ఊరికి రావాలి” అని కోరింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో తప్పకుండా వస్తా అని ఇచ్చిన మాటను, ఈనాడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే మర్చిపోకుండా, ఆమె ఇంటి గడప తొక్కి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.

పవన్ ఇప్పటం(Ippatam) పర్యటనలో కనిపించిన దృశ్యాలు కేవలం రాజకీయ చిత్రాలు కావు, అవి ఒక కొడుకు తన తల్లి దగ్గరకు వెళ్లినంత ఆత్మీయంగా సాగాయి. నాగేశ్వరమ్మను చూడగానే ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, ఆమె పాదాలకు నమస్కరించడం చూస్తుంటే అధికారం ఆయనలో గర్వాన్ని పెంచలేదని, బాధ్యతను మరింత పెంచిందని అర్థమవుతోంది.

కేవలం పలకరింపుతో ఆగిపోకుండా, ఆ వృద్ధురాలికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఆమె మనవడి చదువు కోసం లక్ష రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా, తన సొంత జీతం నుంచి ప్రతి నెల 5 వేల రూపాయలు ఆ పిల్లోడి చదువుకు ఇస్తానని ప్రకటించడం ఆయనలోని దాతృత్వానికి నిదర్శనం. ఇలాంటి పనులు పవన్ కు కొత్తేమీ కాదు. గతంలో తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసినా, గిరిజనులకు ఇచ్చిన మాట కోసం తన పర్యటనను పూర్తి చేసిన రోజే ఆయన నిబద్ధత ఏమిటో ప్రపంచానికి తెలిసింది.

Ippatam
Ippatam

సాధారణంగా నాయకులు పెద్ద పెద్ద ర్యాలీలు, డ్రోన్ షాట్లు, సోషల్ మీడియా ప్రచారాలతో ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నేరుగా ప్రజల ఇళ్లకు వెళ్లి, వారి కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకోవడం ద్వారా ఒక బలమైన ‘పర్సనల్ టచ్’ ను మెయింటైన్ చేస్తున్నారు. మారుమూల గిరిజన తండాలైనా, ఇప్పటం (Ippatam)వంటి చిన్న గ్రామాలైనా ఆయన వెళ్లే తీరు, అక్కడ ముసలి వాళ్ల పట్ల ఆయన చూపే గౌరవం చూస్తుంటే.. అది ఆయన మధ్యతరగతి కుటుంబ పెంచకం నుంచి వచ్చిన సహజమైన గుణమని స్పష్టమవుతోంది. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశమే తప్ప, అది ఒక హోదా కాదని ఆయన నమ్ముతారు. అందుకే సీఎం కుర్చీ కంటే ప్రజల ఆశీర్వాదమే తనకు పెద్దదని ఆయన పదే పదే చెబుతుంటారు.

ఇప్పటం(Ippatam) ఘటన పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను మరింత రెట్టింపు చేసింది. ఒకప్పుడు కూల్చిన ఇళ్ల వద్దే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వెళ్లి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపడం ఒక వృత్తం పూర్తి అయినట్లుగా అనిపిస్తుంది. “మాట నిలబెట్టుకునే పార్టీ జనసేన” అనే నమ్మకాన్ని ఈ పర్యటన ద్వారా ఆయన ప్రజల్లో బలంగా నాటారు. నాగేశ్వరమ్మ లాంటి వృద్ధులు “నువ్వు ముఖ్యమంత్రివి కావాలి” అని మనస్ఫూర్తిగా దీవిస్తుంటే, అది కేవలం ఒక రాజకీయ కోరిక కాదు, అది ఒక తల్లి తన బిడ్డ ఉన్నత స్థితికి వెళ్లాలని కోరుకునే ఆరాటంలా కనిపించింది. అధికారంతో దూరం కావడం కాదు, ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ఆయన మెంటాలిటీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button