Principles:2026లో ప్రశాంతమైన జీవితం గడపడానికి 5 సూత్రాలు ..
Principles: 2026 కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న మనం, సంపాదన వెనుక పరుగులు తీయడంతో పాటు మనసు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి.
Principles
ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న పదం ఒత్తిడి (Stress). ఈ స్ట్రెస్ వల్లే అధిక రక్తపోటు, నిద్రలేమి, చిరాకు వంటి సమస్యలు వస్తున్నాయి. 2026 కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న మనం, సంపాదన వెనుక పరుగులు తీయడంతో పాటు మనసు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి.
మన మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. టెన్షన్ లేని సంతోషకరమైన జీవితం కావాలనుకుంటే కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
దీనిలో మొదటిది డిజిటల్ డిస్టెన్సింగ్. అంటే ఫోన్ను అవసరానికి మించి వాడకపోవడం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ప్రపంచంతో సంబంధం లేకుండా కనీసం గంట సేపు మీకు మీరు సమయం కేటాయించండి.

ముప్పావు గంట అయినా యోగా, జుంబా, ఎక్సర్సైజ్ తప్పనిసరి అలవాటుగా మార్చుకోండి. అలాగే మంచిగా మీకోసం ఆలోచిస్తూ రోజును స్టార్ట్ చేయండి. ఈరోజు ఏ పనులు చేయాలో ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకోవడం మానేయండి. ఆ పోలికలే సగం ఒత్తిడికి కారణం అని తెలుసుకోండి.

రెండోది సరైన ఆహారపు అలవాట్లు. మనం తీసుకునే ఆహారానికి, మన ఆలోచనలకు దగ్గరి సంబంధం ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. అతిగా కారం, మసాలాలు ఉన్న ఆహారం మనసులో ఆందోళనను పెంచుతాయి. సాత్విక ఆహారం, తాజా పండ్లు తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రాత్రిపూట కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడు అలసిపోయి త్వరగా కోపం, చిరాకు, అలసట వస్తాయి.

మూడోది పనుల నిర్వహణ. రేపు చేయవలసిన పనులు ఈరోజే ఒక చిన్న డైరీలో రాసుకోండి. దీనివల్ల పనుల ఒత్తిడి తగ్గుతుంది. ఎవరైనా హెల్ప్ కావాలని అడిగినప్పుడు అది మీకు శక్తికి మించింది అని అనిపించినప్పుడు మొహమాటం లేకుండా నో (No) అని చెప్పడం నేర్చుకోండి.

నాలుగోది ప్రకృతి. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు అయినా ఎండలో నడవడం వల్ల శరీరానికి విటమిన్-డి అందుతుంది, ఇది డిప్రెషన్ రాకుండా కాపాడుతుంది. మొక్కలకు నీళ్లు పోయడం, లేదా పార్కులలో కాసేపు గడిపి రావడం చేయాలి. చెట్లు, మొక్కల మధ్య గడపడం వల్ల మనసులోని భారం తగ్గుతుంది.

ఐదోది.. అత్యంత ముఖ్యమైనది, కష్టమయినది క్షమించే గుణం. ఎదుటివారి తప్పులను క్షమించి మనసును ఖాళీ చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఏడాది ఏదైనా ఒక హాబీని అలవరుచుకోండి.. అది సంగీతం వినడం కావొచ్చు, పుస్తకం చదవడం కావొచ్చు. ఈ చిన్న మార్పులు మీ జీవితాన్ని 2026లో ఎంతో అందంగా మారుస్తాయి. ప్రశాంతమైన మనసే అసలైన ఐశ్వర్యం అని మర్చిపోకండి.



