Ratha Saptami: జనవరిలో సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు.. పండగ తేదీలు ,విశిష్టత ఏంటి?
Ratha Saptami: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
Ratha Saptami
మనమంతా నూతన సంవత్సరం 2026లో అడుగుపెడుతున్నాం. జనవరి నెల ఆధ్యాత్మికంగా , సాంప్రదాయకంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు కూడా ఈ నెలలోనే వస్తాయి.
2026లో జనవరి 14న భోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగలను జరుపుకోనున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
ఇది కేవలం పంటల పండుగ మాత్రమే కాదు, పితృదేవతలకు తర్పణాలు విడిచే పుణ్య సమయం కూడా. ఇక పల్లెల్లో అయితే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇల్లు ఒక కన్నుల పండువగా మారుతుంది.

సంక్రాంతి కంటే ముందే డిసెంబర్ 30న వచ్చే మరో అత్యంత పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి). ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి, ఆరోజు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.అయితే తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి వరకూ ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయి.
జనవరిలో వచ్చే ఈ ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే జనవరి 23న వసంత పంచమి వస్తుంది. ఇది చదువుల తల్లి సరస్వతీ దేవి పుట్టినరోజు.ఆరోజు అక్షరాభ్యాసాలకు ఎంతో శ్రేష్ఠమైనదిగా పండితులు చెబుతారు.
ఆ తర్వాత జనవరి 25న రథసప్తమి(Ratha Saptami) పర్వదినం జరుపుకొంటారు. సూర్య భగవానుడు తన సప్త అశ్వాల రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే రోజు ఇది. ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం ఆరోగ్యానికి, ఆయుష్షుకు ఎంతో మంచిదని పురాణాలు చెబుతాయి. ఇలా జనవరి నెల అంతా భక్తిభావంతో, పండగ సందడితో నిండి ఉండబోతోంది.



