Silver: ఇప్పుడు వెండి కూడా బంగారమే.. సందట్లో సడేమియాలా చైనా ఆంక్షలు
Silver: దీని వెనుక డ్రాగన్ కంట్రీ చైనా హస్తం ఉందనేది అర్థమవుతోంది. తాజాగా వెండి ఎగుమతులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది.
Silver
బంగారం ధరలు ఎప్పుడు ఎంత పెరిగినా సామాన్యుడికి అందుబాటులో ఉండేది మాత్రం వెండి (Silver)మాత్రమే.. ఇకపై ఈ మాట అనుకోవడానికి వీలు లేకుండా పోతోంది. ఎందుకంటే ఇప్పుడు బంగారం కంటే వెండి ధరే భయపెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వెండి (Silver)కూడా బంగారమైపోయింది. రానున్న రోజుల్లో వెండి ధర మరింత పైపైకి వెళ్లిపోవడం ఖాయమైపోయినట్టే కనిపిస్తోంది.
దీని వెనుక డ్రాగన్ కంట్రీ చైనా హస్తం ఉందనేది అర్థమవుతోంది. తాజాగా వెండి ఎగుమతులపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి. ఈ పరిస్థితులపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఎలాన్ మస్క్ వెండి ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేయడానికి చాలా కారణాలున్నాయి. చాలా పరిశ్రమల్లో ఉత్పత్తికి ప్రధానంగా ఉపయోగించేది వెండినే. వెండి కేవలం ఆభరణాల లోహం మాత్రమే కాదన్నది అందరికీ తెలుసు. దీనిని ఇండస్ట్రియల్ మెటల్ గా పిలుస్తారు. విద్యుత్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీలో వెండి భాగమవ్వాల్సిందే.

ముఖ్యంగా టెస్లా కార్లు, సోలార్ సిటీ ప్రాజెక్టులకు వెండి ముడిసరుకుగా చాలా అవసరం ఉంది. ఇప్పుడు చైనా ఆంక్షల వల్ల వెండి దొరక్కపోయినా, ధరలు పెరిగినా దాని తీవ్రత టెస్లాపై ఎక్కువగానే పడనుంది. చైనా ఆంక్షల ఫలితంగా టెస్లా ప్రొడక్షన్ కాస్ట్ కూడా మరింత పెరగనుంది. దీంతో మస్క్ దీనిపై బహిరంగంగానే స్పందించి చైనాపై ఫైర్ అయ్యారు.
డ్రాగన్ కంట్రీ వెండి (Silver)ఎగుమతులను బ్యాన్ చేయలేదు. డ్యుయల్-యూజ్ ఐటమ్స్ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా నుండి వెండిని లేదా వెండి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలంటే.. ఆయా కంపెనీలు ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న చిన్న కంపెనీలకు తలనొప్పే. ఈ ఆంక్షల ద్వారా అమెరికా, భారత్ లాంటి దేశాలకు వెండి దొరక్కుండా చేసే కుట్ర పన్నిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చైనా ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ తయారీలో చైనాదే అగ్రస్థానం. సోలార్ ప్యానెల్ తయారీకి వెండి అవసరం. దీంతో తమకు కావాల్సిన మొత్తం కంటే ఎక్కువగానే స్టోర్ చేసుకుని ఇతర దేశాలను ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనగా భావిస్తున్నారు.



