Swiggy and Zomato: స్విగ్గీ,జొమాటో డెలివరీలు బంద్..న్యూ ఇయర్ వేళ ఈ నిర్ణయానికి రీజనేంటి?
Swiggy and Zomato: డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ, జొమాటో, జెప్టో , ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు చెందిన డెలివరీ బాయ్స్ బుధవారం నుంచి దేశవ్యాప్త సమ్మెకు దిగారు.
Swiggy and Zomato
కొత్త ఏడాది వేడుకల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతుండగా.. డెలివరీ రంగంలో ఒక భారీ కుదుపు చోటుచేసుకుంది. ప్రముఖ ఫుడ్, గ్రోసరీ డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ, జొమాటో, జెప్టో ,(Swiggy and Zomato) ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు చెందిన డెలివరీ బాయ్స్ బుధవారం నుంచి దేశవ్యాప్త సమ్మెకు దిగారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) పిలుపుతో.. ప్రారంభమైన ఈ నిరసన ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకింది.
ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి పార్టీల కోసం ఫుడ్ ఆర్డర్(Swiggy and Zomato) చేయాలనుకునే కోట్లాది మంది సామాన్యులకు ఇది పెద్ద ఝలక్ ఇచ్చినట్లే అయింది. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మె వల్ల ఈరోజు అర్ధరాత్రి జరిగే సెలబ్రేషన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలు అమలు చేస్తున్న కొత్త వేతన విధానం వల్ల వర్కర్లు ఎక్కువగా నష్టపోతున్నారు. గతంలో దసరా, దీపావళి వంటి పండుగ సమయాల్లో వర్కర్లకు అదనపు ఇన్సెంటివ్‌లు , పారదర్శకమైన చెల్లింపులు ఉండేవి.
కానీ ఇప్పుడు కంపెనీలు తమ లాభాల కోసం వర్కర్ల పొట్ట కొడుతున్నాయని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ ఆరోపిస్తుంది. అందుకే పాత చెల్లింపు విధానాన్నే మళ్లీ పునరుద్ధరించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు ’10 నిమిషాల డెలివరీ’ (10-Minute Delivery) విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు. ఈ పది నిమిషాల డెలివరీ మోడల్ వల్ల వర్కర్లపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందని, సమయానికి చేరాలనే ఆందోళనలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇది భద్రతకు ముప్పు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే న్యూ ఇయర్ సమయంలోనే ఇలాంటి నిర్ణయం (Swiggy and Zomato)తీసుకోవడం వెనుక.. సాధారణ రోజులతో పోలిస్తే, న్యూ ఇయర్ సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు 3నుంచి 4 రెట్లు పెరుగుతాయి. ఈ రెండు రోజులు జరిగే బిజినెస్ కొన్ని వందల కోట్లలో ఉంటుంది. ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో తాము పని ఆపేస్తే, కంపెనీల ఆదాయానికి భారీ గండి పడుతుందని కంపెనీలు భావిస్తాయి. ఈ సమయంలోనే తమ డిమాండ్లను వినేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావచ్చని గిగ్ వర్కర్ల యూనియన్ భావించింది.
మరోవైపు ఈ సమ్మె ప్రభావం ముఖ్యంగా మూడు వర్గాలపై పడుతుంది.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఫుడ్ లేదా కేక్స్ వంటివి ఆర్డర్ చేసుకుందాం అనుకునే వారికి ఈరోజు డెలివరీ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆర్డర్ చేసినా ‘డెలివరీ పార్టనర్ నాట్ అవైలబుల్’ అనే మెసేజ్ వచ్చే అవకాశం ఉంది.
పండుగ రోజుల్లో రెస్టారెంట్లకు సగం కంటే ఎక్కువ ఇన్కమ్ ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారానే వస్తుంది. సమ్మె వల్ల ఆర్డర్లు డెలివరీ కాకపోతే, సిద్ధం చేసిన ఫుడ్ వేస్ట్ అవ్వడమే కాకుండా భారీ నష్టాలు వాటిల్లుతాయి.
స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలకు ఈ ఒక్క రోజే వందల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. వేల సంఖ్యలో వర్కర్లు విధులకు దూరంగా ఉండటం వల్ల ఈ కంపెనీల ఆదాయం, బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది.
తమ డిమాండ్లపై కంపెనీల యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, న్యూ ఇయర్ రద్దీని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు టెంపరరీగా ఇన్సెంటివ్‌లు పెంచి సమ్మెను విరమింపజేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ శాశ్వత పరిష్కారం దొరకక, ఈ సమ్మె మరికొన్ని రోజులు కొనసాగితే మాత్రం నిత్యావసర వస్తువుల సరఫరా (Grocery delivery) కూడా నిలిచిపోయి ఇబ్బందులు తప్పవు.



