Just SpiritualLatest News

Gaya: కాశీ కంటే మిన్న అయిన పవిత్ర స్థలం ఇంకోటుందా? ఎక్కడ? దాని ప్రత్యేకత ఏంటి?

Gaya: సాధారణంగా మనం కాశీని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా, గంగానదిని పాపనాశినిగా కొలుస్తారు.

Gaya

హిందూ ధర్మంలో పుణ్యక్షేత్రాల దర్శించుకోవడం అనేది జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. సాధారణంగా మనం కాశీని అత్యంత పవిత్రమైన క్షేత్రంగా, గంగానదిని పాపనాశినిగా కొలుస్తారు. కానీ పురాణాల్లో ఒక మాట ఉంది. గంగానది పాపాలను కడిగేస్తే, గయ క్షేత్రం(Gaya) వంశాలనే ఉద్ధరిస్తుంది. అందుకే గంగానది కంటే గయ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు.

గయ క్షేత్రం (Gaya)గురించి తెలుసుకోవాలంటే ముందుగా ‘గయాసురుడు’ అనే అసురుడి కథను తెలుసుకోవాలి. గయాసురుడు ఎన్నో కఠినమైన తపస్సు చేసి, తన శరీరాన్ని ఎవరూ తాకినా వారికి మోక్షం లభించేలా వరాన్ని పొందాడు. దీంతో లోకంలో పాపులందరూ అతని శరీరాన్ని తాకి నేరుగా స్వర్గానికి వెళ్లిపోతుండటంతో యమధర్మరాజుకు పనిలేకుండా పోయింది.

ఈ సమస్యను పరిష్కరించడానికి దేవతలు ఒక ఉపాయం పన్ని.. గయాసురుడి శరీరంపై యజ్ఞం చేయాలని నిర్ణయించారు. తన శరీరం పవిత్ర కార్యానికి ఉపయోగపడుతుందని తెలిసి ఆ రాక్షసుడు అందుకు అంగీకరించాడు. యజ్ఞం పూర్తయిన తర్వాత గయాసురుడు కదలకుండా ఉండటానికి విష్ణుమూర్తి తన పాదాన్ని అతని తల మీద పెట్టి నొక్కాడు. అప్పుడు గయాసురుడు విష్ణుమూర్తితో ఒక విన్నపం చేసుకున్నాడు.. “స్వామీ! ఎవరైతే ఈ ప్రదేశానికి వచ్చి తమ పితృదేవతలకు పిండప్రదానం చేస్తారో, వారి పూర్వీకులకు మోక్షం లభించేలా వరం ఇవ్వండని కోరాడు. విష్ణువు అనుగ్రహించడంతో అప్పటి నుంచి గయ క్షేత్రం పితృకార్యాలకు ప్రపంచంలోనే అత్యున్నత ప్రదేశంగా మారింది.

గయ(Gaya)లోని విష్ణుపాద ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయం. ఇక్కడి గర్భాలయంలో సుమారు 16 అంగుళాల పొడవున్న విష్ణుమూర్తి కుడి పాదం ముద్ర ఒక శిల మీద క్లియర్‌గా కనిపిస్తుంది. అందుకే విదేశాలలో ఉన్నవారు కూడా తమ పూర్వీకులకు మోక్షం కలగాలని కోరుకునే వారు గయకు వచ్చి ఈ పాదం చెంత పిండప్రదానం చేస్తారు. ఇక్కడ చేసే తర్పణాల వల్ల 21 తరాల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

Gaya
Gaya

రామాయణంలో కూడా గయ క్షేత్రం గురించి ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు తన తండ్రి దశరథ మహారాజుకు తర్పణం వదలడానికి సీతా లక్ష్మణులతో కలిసి గయకు వచ్చారు. రాముడు, లక్ష్మణుడు సామాగ్రి తేవడానికి వెళ్లిన సమయంలో సీతమ్మ ఒంటరిగా ఫల్గుణి నది తీరాన కూర్చుని ఉండగా, దశరథుడే స్వయంగా వచ్చి తనకు ఆకలిగా ఉందని, పిండం ఇవ్వమని సీతమ్మను కోరాడట. రాముడు రావడం ఆలస్యమవుతుందని గ్రహించిన సీతమ్మ, అక్కడి ఫల్గుణి నదిలోని ఇసుకనే పిండాలుగా చేసి ఆయనకు సమర్పించింది. ఆ పిండాలను స్వీకరించిన దశరథుడు తృప్తిగా ఆశీర్వదించి వెళ్లిపోయాడు. ఈ కథ ద్వారా తెలిసేది ఏంటంటే, గయ(Gaya)లో కేవలం ఇసుకతో పిండం పెట్టినా పూర్వీకులు తృప్తి చెందుతారు.

గయ(Gaya)లోని ఫల్గుణి నదికి కూడా ఒక వింతైన చరిత్ర కూడా ఉంది. ఈ నది పైన ఎప్పుడూ నీరు కనిపించదు, కేవలం ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. కానీ ఇసుకను కొంచెం తవ్వినా కూడా లోపల పవిత్రమైన నీరు బయటకు వస్తుంది. అందుకే దీనిని ‘అంతర్వాహిని’ అని పిలుస్తారు. సీతమ్మ ఇచ్చిన ఇసుక పిండాలకు ఫల్గుణి నది సాక్ష్యంగా నిలవలేకపోకపోవడంతో సీతమ్మ ఇచ్చిన శాపం వల్ల ఈ నది ఇలా ఎండిపోయి కనిపిస్తుందని చెబుతారు.

అయినా సరే, ఈ నది లోపలి నీరు గంగానది కంటే పవిత్రమైనదిగా భావిస్తారు. పితృ పక్షాల సమయంలో (మహాలయ పక్షాలు) దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేస్తారు. ఇక్కడ పిండప్రదానం చేస్తే పితృ దోషాలు తొలగిపోవడమే కాకుండా, ఆ వంశంలో సంతానలేమి సమస్యలు కూడా పోతాయని పండితులు చెబుతుంటారు. కాశీలో విశ్వనాథుని దర్శనం ఎంత ముఖ్యమో, గయలో విష్ణుపాదాన్ని దర్శించి పితృ తర్పణం చేయడం అంతకంటే ముఖ్యం అంటారు.

ఆధ్యాత్మికంగా గయ అనేది కేవలం ఒక యాత్రా స్థలం మాత్రమే కాదు. , అది ఒక పరమ పవిత్రమైన సంస్కార కేంద్రం. ఎందుకంటే మనల్ని ఈ భూమి మీదకు తెచ్చిన పూర్వీకుల పట్ల మనం చూపే కృతజ్ఞతే ఈ పిండప్రదానం. గయలో ఒక్కసారి తర్పణం ఇస్తే, వారు మళ్లీ జన్మ ఎత్తకుండా శాశ్వత మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతాయి. కాశీ వెళ్లిన వారు గయను సందర్శించకుండా తిరిగి రాకూడదని పెద్దలు చెబుతారు, ఎందుకంటే కాశీ యాత్ర ఫలితం పూర్తిగా లభించాలంటే గయలో పితృ తర్పణం తప్పనిసరిగా చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button