Vijay Hazare: విజయ్ హజారేకు మళ్లీ స్టార్ ఎట్రాక్షన్.. బరిలో కోహ్లీ, గిల్, జడేజా, రాహుల్
Vijay Hazare: బీసీసీఐ ఎప్పుడైతే దేశవాళీ క్రికెట్ లో ఎవ్వరైనా ఆడాల్సిందే అన్న నిబంధన తీసుకొచ్చిందో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆడాల్సి వచ్చింది.
Vijay Hazare
భారత క్రికెట్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే(Vijay Hazare)ను ఈ సారి ఫ్యాన్స్ బాగా ఫాలో అవుతున్నారు. పలువురు స్టార్ ప్లేయర్స్ ఆడుతుండడమే దీనికి కారణం. గతంలో ఈ టోర్నమెంట్ అసలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగిసిందో కూడా ఎవ్వరికీ తెలిసేది కాదు. మీడియాలో సైతం వార్తలు వచ్చేవి కావు. ఏదైనా సంచలనాలు నమోదైతే తప్ప విజయ్ హజారే(Vijay Hazare) ట్రోఫీ గురించి చర్చ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.
బీసీసీఐ ఎప్పుడైతే దేశవాళీ క్రికెట్ లో ఎవ్వరైనా ఆడాల్సిందే అన్న నిబంధన తీసుకొచ్చిందో చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఆడాల్సి వచ్చింది. తొలి రౌండ్ మ్యాచ్ లలో కోహ్లీ, రోహిత్ శర్మ ఆడడంతో హైప్ మొదలైంది. ఒక్కసారిగా విజయ్ హజారే(Vijay Hazare)కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. మళ్లీ ఇప్పుడు శనివారం జరగబోయే మ్యాచ్ లలో కోహ్లీతో పాటు చాలా మంది టీమిండియా స్టార్ ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు.
సర్వీసెస్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన 2 మ్యాచ్ లలోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు ముందు కోహ్లీ ఆడే చివరి మ్యాచ్ ఇదే. మరోవైపు భారత కెప్టెన్ శుభమన్ గిల్ కూడా విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు.
కివీస్ తో వన్డే సిరీస్ కంటే ముందు పంజాబ్ తరపున రెండు దేశవాళీ మ్యాచ్ లు ఆడనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ అనంతరం గాయంతో సిరీస్ కు దూరమయ్యాడు. ఫామ్ కోల్పోవడంతో టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే గాయం నుంచి కోలుకున్న గిల్ ఫామ్ అందుకునేందుకు విజయ్ హజారే ట్రోఫీలో సిక్కిం, గోవాతో జరిగే మ్యాచ్‌లలో అతడు బరిలోకి దిగనున్నాడు.

అలాగే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హైదరాబాద్ ప్లేయర్స్ తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ కూడా విజయ్ హజారే ట్రోఫీ ఆడబోతున్నారు. జాతీయ జట్టు ఎంపికలో దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శనే పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ సెలక్టర్లు స్పష్టం చేయడంతో యువ ఆటగాళ్లు, సీనియర్లు బరిలో నిలిచారు. ఇప్పటికే పలువురు యువక్రికెటర్లు ఈ టోర్నీలో దుమ్మురేపుతున్నారు.
ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ , ధుృవ్ జురెల్, శార్థూల్ ఠాకూర్ వంటి ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. కివీస్ తో వన్డే సిరీస్ కు ముందు జట్టు ఎంపికకు సంబంధించి ఈ టోర్నీలో ప్రదర్శనలు కూడా ఆయా ప్లేయర్స్ కు కీలకం కానున్నాయి. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ హజారే ట్రోఫీకి ఇంత ఫాలోయింగ్ రావడం అటు బీసీసీఐకి కూడా సంతోషాన్నిస్తోంది.



