Just TelanganaJust PoliticalLatest News

BRS : బీఆర్ఎస్ కమ్ బ్యాక్ ప్లాన్‌ వర్కవుట్ అవుతుందా? ..ఆ ఒక్క అస్త్రంతో కాంగ్రెస్ కోటను ఢీకొట్టగలదా?

BRS: బీజేపీని ఒక మార్జినల్ పార్టీగా చూపిస్తూ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ ఓటర్లకు వివరిస్తోంది.

BRS

తెలంగాణలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరగనున్న మున్సిపాలిటీల ఎన్నికలు ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీలకు సెమీఫైనల్స్‌గా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత నెమ్మదించిన బీఆర్ఎస్, ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా తన పూర్వ వైభవాన్ని ఎలా అయినా చాటుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.

దీని కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఒక పక్కా అటాక్ స్ట్రాటజీని సిద్ధం చేసింది. పట్టణ ఓటర్లను ఆకట్టుకుంటూనే, అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు సాగుతోంది.

బీఆర్ఎస్(BRS) ఈ ఎన్నికల్లో వాడబోతున్న ప్రధాన ఆయుధం జిల్లా పునర్విభజన. కేసీఆర్ హయాంలో ప్రజల ముంగిటకే పరిపాలన ఉండాలని 33 జిల్లాలు పెంచితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను 30కి తగ్గించి అభివృద్ధిని కుంటుపరిచిందని బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణగా చెప్పడానికి చూస్తోంది.

జిల్లాల సంఖ్య తగ్గించడం వల్లే ఫండ్స్ కట్ అయ్యాయని.. పట్టణాల అభివృద్ధి ఆగిపోయిందనే నినాదంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇలా జిల్లా సెంటిమెంట్‌ను రగల్చడం ద్వారా స్థానిక ఓటర్లను ఆకట్టుకోవాలని కేటీఆర్ భావిస్తున్నారు. పట్టణాల్లో కేడర్ బలంగా ఉండటంతో పాటు.. కేటీఆర్ కు ఉన్న అర్బన్ లీడర్ ఇమేజ్ ఈ ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంది.

దీంతో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలులో జరుగుతున్న ఆలస్యాన్ని..ఇప్పుడు రాజకీయ అస్త్రాలుగా వాడుకోవడానికి రెడీ అవుతోంది. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల పెన్షన్, నిరుద్యోగ భృతి అలాగే కొత్త ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది.

మాటల మాయా – కాంగ్రెస్ పాలన పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. గతంలో బీఆర్ఎస్ చేసిన మిషన్ భగీరథ, హరితహారం, 2BHK ఇళ్లు, ఐటీ అభివృద్ధిని ప్రస్తుత రెండు ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోల్చి చూపిస్తూ ప్రజలను ఆలోచింపజేసేలా ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే కేటీఆర్ జిల్లా వారీగా సమీక్షలు మొదలుపెట్టారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ కేడర్ కు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికలను అసెంబ్లీ సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తూ, వార్డు స్థాయి నుంచి అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 4000కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం పార్టీలో కొత్త జోష్ నింపింది. అదే మొమెంటమ్‌ను మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించడానికి కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికీ కరపత్రాలు పంపిణీ చేయడం, రేవంత్ రెడ్డి మాటలకు – వాస్తవాలకు ఉన్న తేడాను వీడియోల ద్వారా ప్రజలకు వివరించడం వంటి డిజిటల్ వ్యూహాలను కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.

బీఆర్ఎస్(BRS) కు మొదటి నుంచి పట్టణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉందన్న సంగతి అన్నిఎన్నికలలో కూడ ప్రూవ్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఆ పార్టీ బలంగానే ఉంది. బీజేపీని ఒక మార్జినల్ పార్టీగా చూపిస్తూ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ ఓటర్లకు వివరిస్తోంది.

BRS
BRS

బీజేపీ వేవ్.. పట్టణాల్లో ఉంటున్నా కూడా గ్రాస్‌రూట్ స్థాయిలో వారికి కేడర్ లేకపోవడం తమకు ప్లస్ అవుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు ఓల్డ్ సిటీ వంటి ఏరియాల్లో ఎంఐఎంతో ఇండైరెక్ట్ అవగాహనతో.. కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్లాన్ కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మొత్తానికి, తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో బీఆర్ఎస్ తన ఉనికిని మళ్లీ చాటుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డడానికి సర్వం సిద్ధం చేసింది. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, పట్టణ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేస్తూ కమ్‌బ్యాక్ ప్లాన్ రెడీ చేసింది. మరి రాబోయే ఈ రసవత్తర పోరులో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో మాత్రం వేచి చూడాల్సిందే.

Smile : ఇతరుల ముఖంలో చిరునవ్వు చూస్తే.. మీ ఆయుష్షు పెరుగుతుందని తెలుసా మీకు?

 

Related Articles

Back to top button