Just NationalJust PoliticalLatest News

Budget 2026: బడ్జెట్ 2026 – నిర్మలమ్మ లెక్కలు..సామాన్యుడికి రిలీఫ్ ఉంటుందా?

Budget 2026 : అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ తరహాలోనే, మోదీ ప్రభుత్వం కూడా భారత్ ఫస్ట్ నినాదంతో ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Budget 2026

భారతదేశ వార్షిక ఆర్థిక ప్రణాళిక లేదా కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఈ బడ్జెట్‌(Budget 2026)ను ప్రవేశపెట్టబోతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ప్రతీ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ప్రభుత్వం చేసే ఖర్చులు , వచ్చే ఆదాయం (రెవెన్యూ) వివరాలను తెలియజేయడమే ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశ్యం.

ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ తరహాలోనే, మోదీ ప్రభుత్వం కూడా భారత్ ఫస్ట్ నినాదంతో ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీడీపీ వృద్ధి రేటును 8 శాతం కంటే ఎక్కువగా ఉంచడం, ద్రవ్యలోటును (Fiscal Deficit) నియంత్రించడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తోంది.

ఈసారి బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు లభించే ‘ఇన్‌కమ్ ట్యాక్స్’ మినహాయింపుల గురించి వస్తున్న వార్తలే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం రూ. 12 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ ఫ్రీ పరిమితిని రూ. 15 లక్షలకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే 15 నుంచి 20 లక్షల ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ స్లాబ్‌ను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించే ప్రపోజల్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

గడిచిన పదేళ్ల బడ్జెట్‌లను గమనిస్తే, 2014లో జన్ ధన్ ఖాతాలు, 2019లో ఆయుష్మాన్ భారత్, 2021లో ఉచిత వ్యాక్సిన్ వంటి పథకాలు సామాన్యులకు మేలు చేశాయి. అలాగే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే 2026 బడ్జెట్(Budget 2026) మధ్యతరగతి వారికి మరింత ఊరటనిచ్చే ‘లైఫ్ చేంజింగ్’ బడ్జెట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆదాయపు పన్నుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా రూ. 50,000 నుంచి ఒక లక్షకు పెంచే అవకాశం ఉంది.

జీఎస్టీ (GST) రేట్ల విషయంలోనూ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పాలు, పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులపై జీరో రేటింగ్ ఇవ్వడం ద్వారా ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భవిష్యత్తులో జీఎస్టీని మూడు స్లాబ్‌ల (5, 12, 18 శాతం) మోడల్‌లోకి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యంగా సమాచారం. దీనివల్ల నిత్యావసరాల ధరలు తగ్గుతాయి.

ఇక రైల్వే రంగానికి ఈసారి రూ. 2.8 లక్షల కోట్ల భారీ కేటాయింపులు జరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరో 500 వందే భారత్ రైళ్లు, 5000 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు, 400 అమృత్ భారత్ స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగవంతం కానున్నాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కూడా మరిన్ని నిధులు దక్కే అవకాశం ఉంది.

దేశ రక్షణ , మౌలిక సదుపాయాల (Infrastructure) కోసం కూడా ప్రభుత్వం భారీగా ఖర్చు చేయబోతోంది. రక్షణ బడ్జెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లకు చేరుతుందని, హైవేలు , ఎయిర్‌పోర్టుల కోసం రూ. 12 లక్షల కోట్లు కేటాయించొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్,బ్యాటరీ స్టోరేజ్ రంగాలకు రూ. 2 లక్షల కోట్ల వరకు ప్రోత్సాహకాలు అందే అవకాశం ఉంది.

ఇది పర్యావరణానికే కాకుండా కొత్తగా 8 కోట్ల ఉద్యోగాల సృష్టికి కూడా ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (MSME) , స్టార్టప్ రంగాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా చిన్న వ్యాపారస్తులకు అండగా నిలవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. మొత్తానికి ఈ 2026 బడ్జెట్ సామాన్యుల జేబులో డబ్బులు మిగిల్చేలా, దేశాన్ని ఆర్థికంగా మరింత బలపరిచేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Flexitarian Diet :ఫ్లెక్సిటేరియన్ డైట్ పేరు విన్నారా? మన ఆరోగ్యానికే కాదు ప్రకృతికి కూడా ఇది మంచిదట

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button