TVK Vijay :ఒంటరి పోరుకే మొగ్గు..విజయ్ కాన్ఫిడెన్స్ కు కారణాలేంటి ?
TVK Vijay : టీవీకే తమిళ వెట్రి కలగానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందన్న దానిపై ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది.
TVK Vijay
రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు.. అందులోనూ కొత్తగా పార్టీ అధికారంలోకి రావడం అంటే ఆషామాషీ కాదు. ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా పలు సందర్భాల్లో బొక్కబోర్లా పడిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ తరహాలో తొలి ప్రయత్నంలోనే విజయం వరించదు. చిరంజీవి, కమల్ హాసన్ , పవన్ కళ్యాణ్ వంటి వారు ఎలాంటి చేదు ఫలితాలు చవిచూసారో అందరికీ తెలుసు. అప్పటి పరిస్థితులను అంచనా వేసుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల సన్నాహాలు మొదలైపోయాయి.
ఈ సారి త్రిముఖ పోరు ఖాయమైంది. నటుడు టీవీకే విజయ్(TVK Vijay) కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చేశారు. టీవీకే తమిళ వెట్రి కలగానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందన్న దానిపై ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో కొద్ది కాలం బ్రేక్ పడినప్పటకీ ఇటీవలే తన చివరి సినిమాను కూడా పూర్తి చేసుకున్న విజయ్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వరుస సమావేశాలు, సభలతో తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా జరిగిన సభలో విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
వచ్చే ఎన్నికల్లో తన టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని టీవీకే విజయ్(TVK Vijay) తేల్చేశారు. ఎంత ఒత్తిడి చేసినా ఎవ్వరికీ తలవంచబోమని కుండబద్దలు కొట్టేశారు. దీంతో విజయ్ పార్టీ ఇక పొత్తుల ముఖచిత్రంలో ఉండదని అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో విజయ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఇది మింగుడుపడడం లేదు. సాధారణంగా తమిళనాట స్థానిక పార్టీలకే ప్రజలు మద్ధతు ఇస్తుంటారు. గత కొన్నేళ్ళుగా డీఎంకే లేదా అన్నాడీఏంకే మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి.
కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చే ఆశలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. విజయ్ తో కలిసి పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాలనుకున్న బీజేపీకి తాజాగా అతను చేసిన కామెంట్స్ తో దాదాపు క్లారిటీ వచ్చినట్టే.

నిజానికి విజయ్ ఒంటరిగా వెళితే తమళనాడు రాజకీయాలను శాసించగలడా.. అతని ప్రభావం ఎంత మేర ఉండబోతోంది.. దీనిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. పలు సర్వేలు కూడా విజయ్ ప్రభావం గట్టిగానే ఉంటుందని అంచనా వేశాయి. అందుకే ఒంటరిగా పోటీచేసేందుకు సిద్ధమైనట్టు భావిస్తున్నారు. ఎప్పుడైతే దళపతి విజయ్ తన రాజకీయ ప్రకటన చేసాడో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారినట్టేనని చెప్పొచ్చు.
విజయ్ పార్టీ, డీఎంకే, అన్నాడీఎంకే వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. అభిమానుల్లో, యువతలో ఉన్న ఫాలోయింగ్ టీవీకేకు ప్లస్ పాయింట్. అయితే, పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా పటిష్టం కావాల్సి ఉంది. ఒంటరిగా పోటీ చేయాలనే విజయ్ నిర్ణయం డీఎంకేకు, అన్నాడీఎంకేకు తలనొప్పిగా మారిందని అంగీకరించాల్సిందే.
ఒకవైపు డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడమే కాదు , ప్రాంతీయ పార్టీల కూటముల సమీకరణాలను కూడా సంక్లిష్టంగా మార్చేశాడు. ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న విజయ్ తమిళ రాజకీయాలను మలుపుతిప్పబోతున్నాడని పలువురు అంచనా వేస్తున్నారు.
Cruise:బడ్జెట్లో సముద్ర ప్రయాణం..క్రూయిజ్ టూర్స్ ప్లాన్ చేస్తారా?..




One Comment