Valentine:ప్రేమాయ నమః.. పెంగ్విన్ల గిఫ్ట్స్ నుంచి కంటిపాపల రహస్యం వరకు.. వాలంటైన్ వీక్ స్పెషల్
Valentine: గ్రీటింగ్ కార్డులు, గులాబీలు, చాక్లెట్ల వ్యాపారం ఈ ఒక్క వాలంటైన్ వీక్‌లోనే వేల కోట్లకు చేరుకుంటుంది.
Valentine
ఫిబ్రవరి మాసం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా ప్రేమమయం అయిపోతుంది. ప్రేమికులంతా తమ మనసులోని మాటను చెప్పడానికి వాలంటైన్స్ డే కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. గ్రీటింగ్ కార్డులు, గులాబీలు, చాక్లెట్ల వ్యాపారం ఈ ఒక్క వాలంటైన్ వీక్‌లోనే వేల కోట్లకు చేరుకుంటుంది. గతేడాది అమెరికాలో సుమారు 2 లక్షల కోట్లు, మన దేశంలో 25 వేల కోట్లకు పైగా వీటి వ్యాపారం జరిగిందంటే ఈ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ప్రేమ ప్రయాణం ఫిబ్రవరి 7 వతేదీన రోజ్ డేతో మొదలై 14తేదీన వాలంటైన్స్(Valentine) డేతో ముగుస్తుంది.
ఫిబ్రవరి 7 – రోజ్ డే.. ఎర్ర గులాబీతో ప్రేమకు అంకురార్పణ. ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక్క రోజే 25 కోట్ల గులాబీలు అమ్ముడవుతాయట.
ఫిబ్రవరి 8 – ప్రపోజ్ డే.. దాచుకున్న భావాలను ప్రేమికులు బయటపెట్టే రోజు.
ఫిబ్రవరి 9 – చాక్లెట్ డే.. తీపి జ్ఞాపకాల కోసం 4 కోట్ల హృదయాకారపు చాక్లెట్ బాక్సులు ఈ రోజు కొంటారట.
ఫిబ్రవరి 10 – టెడ్డీ డే.. క్యూట్ టెడ్డీలతో ప్రేమికులకు గిఫ్ట్ ఇచ్చే రోజు.
ఫిబ్రవరి 11 – ప్రామిస్ డే..తమ భాగస్వాములకు జీవితాంతం తోడుంటామని హామీ ఇచ్చుకోవడం.
ఫిబ్రవరి 12 – హగ్ డే.. ఇద్దరు మనుషులు కాదు..ఇద్దరి మనసులు కలిసే ఆలింగనంగా దీనిని చెబుతారు.
ఫిబ్రవరి 13 – కిస్ డే.. ముద్దుతో ప్రేమ బంధానికి ప్రేమికులు ముద్ర వేసే రోజు
ఫిబ్రవరి 14 – వాలంటైన్స్ డే.. ప్రేమికుల అసలైన పండుగ. ఈ ఒక్క రోజే 20 కోట్ల గ్రీటింగ్ కార్డులు అమ్ముడవుతాయి.ఇవే కాకుండా తమ మనసుకు నచ్చినవారికి రకరకాల బహుమతులు అందచేసుకుంటారు.
ప్రేమ మనుషులకే కాదు జంతువులలోనూ కలుగుతుందన్నది తెలిసిన విషయమే అయితే ఇవి కూడా తమ ప్రేమను ఎంతో ప్రేమగా వ్యక్తపరుస్తుంటాయి. మగ పెంగ్విన్లు సముద్ర తీరమంతా వెతికి మరీ తమ ప్రియురాలి కోసం నున్నటి రాళ్లను గిఫ్ట్‌గా ఇస్తాయట.
ఇక డాల్ఫిన్లు అయితే ఒకదానినొకటి ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ప్రత్యేకమైన శబ్దాలు చేస్తాయి.
ఆఫ్రికాలోని ‘లవ్‌బర్డ్స్’ అని పిలిచే చిలుకలు.. తమ జీవితాంతం కూడా ఒకే జంటతో కలిసి ఉంటూ, ఒకదానికొకటి ప్రేమగా తినిపించుకుంటాయి.
సముద్ర గుర్రాలు (Seahorses) అయితే పడుకునేటపుడు కూడా ఒకదాని తోకను ఒకటి పట్టుకుని అస్సలు వదిలిపెట్టకుండానే ఉంటాయట.

ప్రేమలోని సైన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ నిజాలను కొన్ని చూస్తే..
మీరు ఇష్టపడే వ్యక్తి కళ్లలోకి మీరు చూసినప్పుడు మీ కంటిపాప సైజు 45 శాతం వరకు పెరుగుతుందట. అంతేకాకుండా..
ఇద్దరు ప్రేమికులు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటున్నప్పుడు వారి గుండె లయ (Heartbeat) కూడా ఒక్కటిగా మారుతుందట.
ప్రేమలో పడినప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్ అనే హార్మోన్లు రిలీజై ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే ఆక్సిటోసిన్‌ను ‘లవ్ హార్మోన్’ అంటారు. ఇది మతిమరుపును తగ్గించడమే కాకుండా నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుందట.
సాధారణంగా ఐ లవ్ యూ అని చెప్పడంలో ఎప్పుడూ కూడా అమ్మాయిలే ముందుంటారని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రాణంగా ప్రేమించిన వాళ్లు దూరమైనప్పుడు మనసు పడే వేదన వల్ల శరీరంలో రిలీజయ్యే రసాయనాలు గుండెను బలహీనపరుస్తాయి. దీనినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు.
రాజస్థాన్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో లైలా మజ్నూల ప్రేమకు చిహ్నంగా ఒక దర్గా కూడా ఉంది. వాలెంటైన్(Valentine) డే రోజు ప్రేమికులంతా చేరి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు.
ఏది ఏమయినా ప్రేమ అనేది కేవలం కానుకలకు పరిమితం కాకుండా.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ సాగిపోయే అద్భుత ప్రయాణం అని తెలుసుకున్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది.




One Comment