SL vs NZ : శ్రీలంక ఖేల్ ఖతమ్…సెమీస్ చేరువలో కివీస్
SL vs NZ : ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య శ్రీలంక కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిపోవడంతో ఇంటిదారి పట్టింది
SL vs NZ
ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆతిథ్య శ్రీలంక కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో న్యూజిలాండ్(SL vs NZ) పై చిత్తుగా ఓడిపోవడంతో ఇంటిదారి పట్టింది. ఒక దశలో కివీస్ ఓటమి ఖాయమనుకున్నారు. కానీ స్లాగ్ ఓవర్లలో లంక బౌలర్లు పట్టుసడలించడం వారి కొంపముంచింది. న్యూజిలాండ్ భారీస్కోరు సాధించడం, ఛేజింగ్ లో లంక చేతులెత్తేయడం, టోర్నీ నుంచి లంక నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర (32) , గ్లెన్ ఫిలిప్స్ (18) పరుగులకు ఔటయ్యారు. అయితే కీలక సమయంలో 9 పరుగుల తేడాతో 4 వికెట్లు కోల్పోవడంతో లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే కెప్టెన్ మిఛెల్ శాంట్నర్, ఆల్ రౌండర్ మెకొంచీ పార్టనర్ షిప్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. వీరిద్దరూ లంక బౌలర్లను కాసేపు ఆచితూచి ఆడి తర్వాత రెచ్చిపోయారు. ముఖ్యంగా శాంట్నర్ అద్భుతమైన షాట్లతో చెలరేగిపోయాడు.
శాంట్నర్ కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. అటు మరో ఆల్ రౌండర్ మెకొంచీ కూడా ధాటిగా ఆడడంతో న్యూజిలాండ్ స్కోరు టాప్ గేర్ లో సాగింది. మెకొంచీ 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో నిలిచాడు. వీరిద్దరూ రికార్డు స్థాయిలో ఎనిమిదో వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో కివీస్ 70 పరుగులు చేసింది. లంక బౌలర్లలో తీక్షణ 3, చమీరా 3, వెల్లలాగే 1 వికెట్ పడగొట్టారు.

అనంతరం స్పిన్ పిచ్ పై కాస్త టప్ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు తొలి బంతితోనే కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ దిమ్మతిరిగే షాకిచ్చాడు. సెంచరీ హీరో నిస్సాంకను పెవిలియన్ కు పంపాడు. ఇక్కడ నుంచీ శ్రీలంక వరుస వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయిన లంక కేవలం 20 పరుగులే చేసింది. తర్వాత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోవడంతో వికెట్లు కోల్పోతూనే ఉంది.
కమిందు మెండిస్ (31), వెల్లాలాగే (29) తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 107 పరుగులే చేయగలిగింది. రచిన్ రవీంద్ర 4 వికెట్లతో అదరగొట్టాడు. ఈ ఓటమితో లంక టోర్నీ నుంచి నిష్క్రమించగా…న్యూజిలాండ్ సెమీఫైనల్ కు చేరువైంది.



