Akvan Cyclone : కోస్తాంధ్రకు అక్వాన్ ముప్పు..ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..
Akvan Cyclone : కోస్తాంధ్రకు అక్వాన్ తుఫాను ముప్పు పొంచి ఉంది. 145 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
Akvan Cyclone
అర్నబ్, మురసు తుపానుల ధాటికి ఇప్పటికే అల్లాడిపోయిన కోస్తాంధ్రపై.. మరో తుపాన్ దండెత్తడానికి సిద్ధమయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింతగా బలపడి తుపానుగా రూపంతరం చెందుతోందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ, ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం నవంబర్ 16వ తేదీకి అంటే ఈరోజు సాయంత్రానికే తుపానుగా మారి, తీరం వైపు భయంకరమైన వేగంతో దూసుకొచ్చే ప్రమాదముంది. ఈ తుపానును అక్వాన్ (Akvan)గా పిలుస్తున్నారు.
ప్రస్తుతం గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ. వేగంతో నెమ్మదిగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి 720 కి.మీ.దూరంలో, విశాఖపట్నానికి 820 కి.మీ.దూరంలోనూ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 940 కి.మీ. దూరంలో ఉంది. సాయంత్రానికి ఇది తుపానుగా రూపాంతరం చెందిన తర్వాత, తర్వాత 48 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారి డైరెక్టుగా కోస్తాంధ్ర తీర ప్రాంతాన్ని ఢీకొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఈ తుపాను(Akvan Cyclone) ప్రభావంతో ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏపీలో విస్తారంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 19వ తేదీ, 20 వ తేదీల్లో ఏపీ తీరం వెంబడి గంటకు ఏకంగా 145 కి.మీ. అత్యంత తీవ్రమైన వేగంతో ప్రచండ గాలులు విరుచుకుపడే ప్రమాదం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముందు జాగ్రత్త చర్యగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో ప్రమాద హెచ్చరికలు ఎగరేయగా, ఈనెల 20వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఈ తుపానుకు అక్వాన్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తుపాన్ విపత్తుల కోసం ముందుగానే సూచించే పేరులలో.. అక్వాన్ (Akvan Cyclone) అనేది ఇరాన్ దేశం సూచించిన పేరు. పర్షియన్, ఇరానియన్ పురాణాలు, జానపద కథల ప్రకారం అక్వాన్ అంటే దుష్ట మనస్సు (Evil Mind), దుష్ట ఆలోచన లేదా రాక్షస శక్తి అని అర్థం.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితికి చెందిన ESCAP సిస్టం ఆధ్వర్యంలో ఉత్తర హిందూ మహాసముద్రంలో అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 సెప్టెంబర్ నుంచే ప్రారంభమైంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ లిస్టును 2020 ఏప్రిల్‌లో ఆమోదించారు.
దీనిలో భారతదేశంలో పాటు బంగ్లాదేశ్, ఇరాన్, శ్రీలంక, థాయిలాండ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ అనే 13 ప్రాంతీయ దేశాలు పాల్గొంటాయి. ప్రతీ దేశం 13 పేర్లను అందించడంతో మొత్తం 169 పేర్లతో ఈ లిస్టును రూపొందించారు. ఒక క్రమ పద్ధతిలో కాలమ్‌ల వారీగా ఈ పేర్లను వరుసగా ఉపయోగిస్తుంటారు. ఒక్కసారి వాడేసిన పేరును మళ్లీ ఏ ఇతర తుపానుకూ వాడకూడదనేది ఇక్కడ నియమం.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?





