T20 World Cup : టీ20 వరల్డ్ కప్@500 మిలియన్లు..వ్యూయర్ షిప్‌లో సరికొత్త రికార్డ్
T20 World Cup : ప్రపంచ క్రికెట్‌లో టీ ట్వంటీ ఫార్మాట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్ట్, వన్డేలతో పోలిస్తే గత దశాబ్ద కాలంగా పొట్టి ఫార్మాట్ కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది
T20 World Cup
ప్రపంచ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెస్ట్, వన్డేలతో పోలిస్తే గత దశాబ్ద కాలంగా పొట్టి ఫార్మాట్ కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. తాజాగా టీ20 ప్రపంచకప్ తో ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రతీసారీ వ్యూయర్ షిప్ లో రికార్డులు సృష్టిస్తోన్న టీ20 ప్రపంచకప్ ఈ సారి కూడా దుమ్మురేపుతోంది. అందులోనూ క్రికెట్ ను మతంలా ఆరాధించే భారత్ లో ఈ టోర్నీ జరుగుతుండడంతో క్రేజ్ మరింత పెరిగింది.
అటు టీవీ, డిజిటల్ వ్యూయర్ షిప్ లోనూ ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 World Cup) 2026 రికార్డులు బద్దలు కొట్టింది. భారత్ మ్యాచ్ లకు సహజంగానే అద్భుతమైన వ్యూయర్ షిప్ వస్తుంది. ఈ సారి మిగిలిన జట్ల మ్యాచ్ లను సైతం అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు.
తాజాగా వ్యూయర్ షిప్ కు సంబంధించిన వివరాలను ఐసీసీ ఛైర్మన్ జైషా వెల్లడించారు. సూపర్ 8 మ్యాచ్ లను దాదాపు 500 మిలియన్ల మంది వీక్షించినట్టు తెలిపారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే రికార్డని ఆయన పేర్కొన్నారు. అలాగే జియో హాట్ స్టార్ లో అత్యధికంగా 6.05 కోట్ల మంది మ్యాచ్ లు వీక్షించారని సోషల్ మీడియాలో జైషా పోస్ట్ పెట్టారు. రానున్న మ్యాచ్ లకు దీనికి మించి వ్యూయర్ షిప్ నమోదవుతుందన్నారు.

ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతోనే టీ20 ప్రపంచకప్(T20 World Cup) 2026ను ప్రారంభించామనీ, అనుకున్నట్టుగానే ముందుకెళుతుండడం సంతోషంగా ఉందని చెప్పారు. సెమీఫైనల్ మ్యాచ్ లు కూడా మరింత రసవత్తరంగా సాగుతాయన్న అంచనా.. తొలి మ్యాచ్ తోనే రుజువైందన్నారు.
ఈడెన్ గార్డెన్స్ లో భారత్ మ్యాచ్ కాకున్నా అభిమానులు భారీగా తరలిరావడం టోర్నీ సక్సెస్ కు కారణంగా చెప్పుకొచ్చారు. మరోవైపు అంచనాలు పెట్టుకున్న జట్లే సెమీస్ లో అడుగుపెట్టాయి. భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు నాకౌట్ స్టేజ్ కు దూసుకొచ్చాయి. నిజానికి ఈ టోర్నీ ఆరంభం నుంచీ మ్యాచ్ లు ఆసక్తికరంగానే సాగుతున్నాయి.
గ్రూప్ స్టేజ్ లో పలు చిన్న జట్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాయి. నేపాల్ , అమెరికాతో పాటు జింబాబ్వే కూడా అదరగొట్టాయి. జింబాబ్వే అయితే ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. ఇప్పుడు భారత్ , ఇంగ్లాండ్ సెమీఫైనల్ కూడా సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశముంది.



