Just Andhra PradeshHealthJust NationalLatest News

Omicron RF.5 : 10 జిల్లాలకు పాకిన ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5..మళ్లీ మాస్కుల బాట పట్టాల్సిందేనా?

Omicron RF.5 : ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర,కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Omicron RF.5

ఏపీలో మెల్లగా మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. ఒకప్పుడు పక్కవాళ్లు తుమ్మినా, దగ్గినా భయపడిన రోజులను గుర్తుచేస్తూ మరోసారి ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5(Omicron RF.5) అనే కొత్త వేరియంట్ ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. నిన్నటివరకు ఒకటి 6 అనుకున్న కేసులు ఒక్కసారిగా పెరుగుతూ మొత్తం 26కు చేరాయి.

అంతేకాదు ఈ వైరస్ బారినపడి నలుగురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. అయితే చనిపోయిన వారంతా కడప, కాకినాడ జిల్లాలకు చెందిన వారని, వారు ఇప్పటికే బీపీ, షుగర్, కిడ్నీ సమస్యల వంటి తీవ్రమైన దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

కడప నుంచి విశాఖ వరకు సుమారు 10 జిల్లాలకు ఈ మహమ్మారి పాకేసింది. జిల్లాల వారీగా చూస్తే వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఎక్కువగా 8 కేసులు నమోదవగా, గుంటూరులో 6 కేసులు, తూర్పు గోదావరిలో 3 కేసులు, బాపట్ల, కాకినాడ జిల్లాల్లో రెండేసి కేసులు నమోదయ్యాయి.

అలాగే విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా, పార్వతీపురం మన్యం, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున వెలుగు చూశాయి. ప్రస్తుతం నమోదైన బాధితుల్లో 8 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, నలుగురు ఇంట్లోనే ఐసోలేషన్‌లో జాగ్రత్తగా ఉంటూ కోలుకుంటున్నారు. మరో ముగ్గురు పూర్తిగా నయమై హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.

రెండు రోజుల క్రితం బాధితుల శాంపిళ్లను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించి టెస్ట్ చేయగా, ఇది గతంలో వచ్చిన జేఎన్.1 వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన ఆర్ఎఫ్.5 సబ్‌లైనేజ్ అని తేలింది. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి విస్తరించిన ఈ వేరియంట్ పట్ల.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించడంతో మన హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా అలర్ట్ అయింది.

Omicron RF.5
Omicron RF.5

అయితే ఈ వేరియంట్ తీవ్రత చాలా తక్కువేనని, అనవసరంగా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ వైరస్‌తో బాధపడేవారిలో జలుబు, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వరం మాత్రమే లక్షణాలుగా ఉంటున్నాయి.

కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర,కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. సాధారణ ఒమిక్రాన్‌తో పోలిస్తే ఇది ప్రాణాంతకం కాకపోయినా .. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మాత్రం మాస్కులు ధరిస్తూ, సమూహాలకు దూరంగా ఉంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

Mega 158 : పండగ రేస్ కంటే సోలో రిలీజే బెటర్.. చిరు, బాబీ మూవీ ప్లాన్ మారిందా?

Related Articles

Back to top button