Just SportsLatest News

IND vs ENG : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్.. ఓడినా వణికించిన ఇంగ్లాండ్

IND vs ENG : డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టీ20 ప్రపంచకప్ కు అడుగుదూరంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ పై విజయం సాధించింది

IND vs ENG

డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా టీ20 ప్రపంచకప్ కు అడుగుదూరంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్(IND vs ENG) పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగి భారీస్కోరు చేసినా ఇంగ్లీష్ టీమ్ చివరి వరకూ పోరాడడంతో కాస్త టెన్షన్ నెలకొంది. అయితే చివర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ మ్యాచ్ గెలవగలిగింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం భారత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. తుది జట్టు ఎటువంటి మార్పులు చేయలేదు. నాకౌట్ మ్యాచ్ కావడంతో మొదటి బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్థేసిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే వ్యూహం బాగానే సక్సెస్ అయ్యింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు.

అయితే విండీస్ పై దుమ్మురేపిన సంజూ శాంసన్ ఇంగ్లాండ్ పైనే రెచ్చిపోయాడు. ఇంగ్లీష్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అట ఇషాన్ కిషన్ కూడా చెలరేగిపోవడంతో భారత్ స్కోరు బోర్డు ఫస్ట్ గేర్ లో సాగింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 45 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. ఇషాన్ కిషన్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఔటవగా.. సంజూకు దూబే జత కలిసాడు. భారీస్కోరు అందించడమే లక్ష్యంగా వీరిద్దరూ కూడా చెలరేగిపోయారు.

ఫలితంగా భారత్ రన్ రేట్ ఓవర్ కు 12కు పైగా సాగింది. సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 (8 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేయగా.. దూబే 25 బంతుల్లో 43 (1 ఫోర్, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. చివర్లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కూడా విధ్వంసం సృష్టించాడు. కేవలం 7 బంతుల్లోనే 21 పరుగులు చేయగా.. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2 , ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీశారు. మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 5, హ్యారీ బ్రూక్ 7, బట్లర్ 27 పరుగులకు ఔటవగా..టామ్ బాంటన్ 17 రన్స్ కు వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ 95 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయినా రన్ రేట్ బాగానే నిలుపుకుంది. అయితే విల్ జాక్స్, జాకబ్ బెథల్ పార్టనర్ షిప్ మళ్లీ ఇంగ్లాండ్ కు విజయంపై ఆశలు రేకెత్తించింది. ముఖ్యంగా బెథెల్ భారీ షాట్లతో భారత బౌలింగ్ పై ఎదురుదాడికి దిగాడు.

IND vs ENG
IND vs ENG

అటు విల్ జాక్స్ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరిగిపోకుండా జాగ్రత్తగా ఆడింది. వీరిద్దరూ 39 బంతుల్లోనే 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విల్ జాక్స్ 35 రన్స్ కు ఔటైనా.. బెథల్, సామ్ కరన్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరి జోడీ 27 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం, బెథల్ సెంచరీ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. బెథల్ 45 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు.

చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండగా.. 18వ ఓవర్ ను బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులే ఇవ్వడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. అయితే చివర్లో భారత్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోవడంతో పెనాల్టీ పడింది. ఫలితంగా 30 యార్డ్ సర్కిల్ అవతల ముగ్గురినే ఉంచాల్సి వచ్చింది.

అయినా సరే.. చివరి ఓవర్ కు బంతిని అందుకున్న దూబే బౌలింగ్ లో బెథల్ రనౌట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఈ ఓవర్లో ఆర్చర్ మూడు సిక్సర్లు బాదినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఫలితంగా భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన టీమిండియా ఆదివారం జరిగే టైటిల్ పోరులో న్యూజిలాండ్ తో తలపడుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button