Temple:గుడిలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? పూర్తి పుణ్యం దక్కాలంటే ఏం చేయాలో తెలుసుకోండి
Temple: గుడిలో దీపం వెలిగించేటప్పుడు కొంతమంది ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగిస్తుంటారు.
Temple
మనం ఎంతో భక్తితో, మనశ్శాంతి కోసం గుడికి వెళ్తుంటాం. అయితే చాలా మంది గుడి(Temple)కి వెళతారు కానీ.. గుడికి వెళ్లినప్పుడు కొన్ని ఆధ్యాత్మిక నియమాలు తప్పకుండా పాటించాలని తెలియక తప్పులు చేస్తుంటారని.. పండితులు చెబుతున్నారు .
చాలామంది గర్భగుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకొనేటప్పుడు.. దేవుడికి ఎదురుగా నిలబడి కళ్లు మూసుకుంటారు. కానీ దేవుడికి ఎదురుగా నిలబడకూడదని.. కొంచెం పక్కకు నిలబడి దర్శనం చేసుకోవాలని పురాణాలలో ఉంది. ఎందుకంటే గర్భగుడిలో ఉండే దేవుడి నుంచి వచ్చే విపరీతమైన శక్తిని మనం నేరుగా తట్టుకోలేమట.
అలాగే గుడిలో దీపం వెలిగించేటప్పుడు.. కొంతమంది ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగిస్తుంటారు. కానీ ఇలా చేయకుండా ప్రతి దీపాన్ని విడిగా అగ్గిపెట్టెతోనే వెలిగించాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడయితే చాలామంది పరుగు తీసినట్టు చాలా వేగంగా చుట్టూ గుడి చుట్టూ తిరుగుతుంటారు.
కానీ ప్రదక్షిణలనేవి చాలా నిలకడగా, ఏకాగ్రతతో చేయాలి. ఎలా అంటే ఒక నిండు గర్భిణీ అడుగులో అడుగు వేస్తూ.. ఎంత నెమ్మదిగా నడుస్తుందో, అంత మెల్లగా ప్రదక్షిణలు చేయాలి. ఆ సమయంలో పక్కవాళ్లతో అనవసరమైన మాటలు మాట్లాడటం, ఫోన్ మాట్లాడటం వంటివి చేయకుండా కేవలం దైవ నామస్మరణ మాత్రమే చేయాలి.

అంతే కాకుండా చివరిగా దర్శనం ముగిసిన తర్వాత.. ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ గర్భగుడికి, ధ్వజస్తంభానికి మధ్యలో నమస్కారం చేయకూడదు. గుడి (Temple) నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం రెండు నిమిషాల పాటు అయినా గుడిలో కూర్చొంటే..ఆ ఆలయంలోని సానుకూల తరంగాలు శరీరానికి పూర్తిగా అందుతాయి.
దేవుడి దర్శనం చేసుకున్న వెంటనే.. వెను తిరిగి రావడం వల్ల ఆలయానికి వెళ్లిన ఫలితం ఉండదని చెబుతారు. అలాగే మనం ఇచ్చే నైవేద్యం, హారతి తీసుకోవడం వెనుక కూడా ఒక పద్ధతి ఉంటుందట. భక్తితో పాటు ఈ చిన్నచిన్న నియమాలను పాటిస్తేనే మన దేవుడి దర్శనం సంపూర్ణం అవుతుందని పండితులు వివరిస్తున్నారు.



