CJP : ఆరని నీట్ వివాదపు మంటలు.. ఘర్షణ వాతావరణంలోనూ మానవత్వం మరువని నిరసనకారులు..
CJP : జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, కొంతమంది నిరసనకారులు మీడియాతో పాటు చుట్టుపక్కల వారిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు.
CJP
హస్తిన వేదికగా జరుగుతున్న నీట్ (NEET) ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వివాదం, విద్యార్థుల ఆందోళనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నిరసనల్లో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి సపోర్టుగా 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సోనమ్ వాంగ్‌చుక్, ప్రైవేట్ వైద్యశాల అయిన మేదాంత హాస్పిటల్‌కి తరలించడానికి కోర్టు అనుమతినిచ్చింది.
సోనమ్ వాంగ్‌చుక్‌ను మేదాంతకు ఎందుకు తరలించకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన సబ్‌మిట్ చేసిన లెటర్ ఆధారంగా సోనమ్ ఆరోగ్య పరిస్థితిని కంటిన్యూగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉందనడంతో పాటు, తన మొబైల్‌ను స్వాధీనం చేసుకోవడం, ఎవరినీ కలవనీయకపోవడం, కాగితాలు కూడా అనుమతించకపోవడంపై వాంగ్‌చుక్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయగా ఈ విషయాలను ఆయన లాయర్.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.కాగా, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ..దీనికి సూత్రప్రాయంగా అంగీకరించారు.
జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తుండగా, రెండు రోజుల క్రితం ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వాంగ్‌చుక్‌ను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించడంతో.. ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
మరోవైపు హస్తిన వీధులు విద్యార్థుల నిరసనలతో హోరెత్తిపోతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,అలాగే పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది యువత, నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. టియర్ గ్యాస్ ప్రయోగం, ఆందోళనకారుల కేకల మధ్య ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీ వార్తా ఛానెల్ ఈ ఘర్షణలను ప్రసారం చేస్తుంటే, అక్కడ పని చేస్తున్న రిపోర్టర్లు, కెమెరామెన్‌లకు మాత్రం ఘర్షణలకు అతీతంగా స్టూడెంట్స్ నుంచి ఎంతో సహానుభూతి, మానవత్వం ఎదురయ్యాయి.
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, కొంతమంది నిరసనకారులు మీడియాతో పాటు చుట్టుపక్కల వారిపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడే ఉన్న మిగిలిన నిరసనకారులు వెంటనే స్పందించి, ఒక మానవ హారంగా ఏర్పడి జర్నలిస్టులను రక్షించారు.
తమ పోరాటం న్యాయం కోసం మాత్రమేనని, హింస కోసం కాదని స్పష్టం చేస్తూ ఆందోళనకారులను వెనక్కి తగ్గించారు. తమ ఆవేదనను ప్రపంచానికి చాటాలనే తపన తప్ప వారిలో ఎక్కడా కూడా హద్దులు దాటే నైజం కనిపించకపోవడం అక్కడివారిని ఆలోచింపచేసింది.
అలాగే రైసినా రోడ్ వద్ద పోలీసులు కెమికల్ స్మోక్‌ను ఉపయోగించినప్పుడు, ఊపిరాడక, కళ్ల మంటతో ఇబ్బంది పడుతున్న కెమెరా మెన్‌కి ఇద్దరు యువతులు సాయం చేశారు. కళ్లల్లో నీళ్లు పోసి, మాస్క్ అందించి ఆ సమయంలో కూడా అండగా నిలిచారు.

మరోవైపు ఢిల్లీని ముంచెత్తిన వర్షంలో కూడా విద్యార్థులెవరూ కూడా తమ నిరసనను ఆపలేదు. తడిసిపోతున్న కెమెరాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న కెమెరామెన్‌ను చూసి, ఒక యువతి తన వద్ద ఉన్న గొడుగును అతనికి అందించి, తమ పోరాటాన్ని ప్రపంచానికి చూపిస్తున్నందుకు ఇది చాలా అవసరం అని అతనితో చెప్పడం ప్రతి ఒక్కరిని కదిలించింది.
వివాదాలు, ఆందోళనలు(CJP) ఒకవైపు నడుస్తున్నా…. తమ హక్కుల కోసం పోరాడే ఈనాటి యువతలో ఉండే బాధ్యత, మానవత్వం, జర్నలిస్టుల పట్ల వారు చూపించిన గౌరవం ఈ ఆందోళనలో ఒక ప్రత్యేకమైన కోణాన్ని ఆవిష్కరించాయి.





