India : కప్పు మనదే బిగిలూ.. ఫైనల్లో టీమిండియా ఆల్ రౌండ్ షో
India : అంచనాలు తప్పలేదు... డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మరోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది
India
అంచనాలు తప్పలేదు… డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా(India) మరోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. వరుసగా రెండోసారి, ఓవరాల్ గా మూడోసారి వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్ , తర్వాత బౌలింగ్ , ఫీల్డింగ్ లలో అదరగొట్టిన న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. అందరి అంచనాలకు భిన్నంగా కివీస్ టైటిల్ పోరులో పెద్దగా పోటీనివ్వలేకపోయింది. ఈమ్యాచ్ లో భారత(India) బ్యాటర్లు దుమ్మురేపారు.
టాప్ 3 బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురూ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. ఈ టోర్నీ మొత్తం విఫలమై విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం అదరగొట్టేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు సంజూ శాంసన్ కూడా తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేశాడు. పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ మరింత దూకుడుగా ఆడే క్రమంలో 52 ( 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. భారత్ 100 పరుగుల మార్కును కేవలం 7.2 ఓవర్లలోనే అందుకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి సంజూ శాంసన్ మరింత చెలరేగాడు. భారీ సిక్సర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా భారత్ రన్ రేట్ ఓవర్ కు 14 కు పైగా సాగింది. ఈ క్రమంలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించిన సంజూ సెంచరీ చేసేలా కనిపించాడు.

అటు ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడి 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 45 బంతుల్లోనే 105 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. అయితే సెంచరీ చేస్తాడనుకున్న సంజూ శాంసన్ 89 పరుగులకు వెనుదిరిగాడు. సంజూ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. అయితే సంజూ ఔటైన తర్వాత సూర్యకుమార్ డకౌటవడం, హార్థిక్ పాండ్యా కూడా వెనుదిరగడంతో కాస్త టెన్షన్ నెలకొంది. భారత్ 230 లోపు పరిమితయ్యేలా కనిపించింది.
ఈ దశలో శివమ్ దూబే రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జిమ్మీ నీషమ్ 3 వికెట్లు తీసినా 46 రన్స్ ఇచ్చాడు.
పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నా సరే ఫైనల్లో ఉండే ఒత్తిడిని న్యూజిలాండ్ అధిగమించలేకపోయింది. ఆరంభం నుంచే తడబడింది. తొలి రెండు ఓవర్లలో బాగానే ఆడినా తర్వాత చేతులెత్తేసింది. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు మ్యాచ్ ను తమవైపు తిప్పేసుకున్నారు. ఫిన్ అలెన్ (9), ఫిలిప్స్ (5), రచిన్ రవీంద్ర (1), చాప్ మన్ (3) పరుగులకే ఔటవగా..సిఫెర్ట్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
సౌతాఫ్రికాపై సెమీఫైనల్లో కివీస్ ఆట చూసిన తర్వాత ఆ జట్టు గట్టిపోటీ ఇస్తుందేమో అనిపించింది. అయితే భారత బౌలర్లు న్యూజిలాండ్ కు ఆ అవకాశం ఇవ్వలేదు. అక్షర్ పటేల్ కీలక వికెట్లు తీస్తే.. తర్వాత బుమ్రా కూడా చెలరేగిపోయాడు. దీంతో న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికే మ్యాచ్ ఫలితం అర్థమైపోయింది.

తర్వాత మిఛెల్ శాంట్నర్ (43) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్ రేట్ ఇంకా చాలా ఉండిపోవడంతో టెయిలెండర్లు కూడా చేతులెత్తేశారు. ముఖ్యంగా తాను ఎంత అద్భుతమైన బౌలరో బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన ఈ స్టార్ పేసర్ తన స్పెల్ లో కేవలం 15 పరుగులే ఇచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
కాగా ఈ విజయంతో భారత్ చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలుచుకోవడంతో పాటు సొంతగడ్డపై టైటిల్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. అలాగే ఓవరాల్ గా అత్యధిక సార్లు(మూడోసారి) టీ20 ప్రపంచకప్ సాధించిన టీమ్ గా చరిత్రలో నిలిచింది.





