SRH vs LSG : జోరు కొనసాగేనా ?…లక్నోతో సన్ రైజర్స్ పోరు
SRH vs LSG : ఐపీఎల్ 2026 సీజన్ లో రెండో డబుల్ హెడర్ ఆదివారం అభిమానులను అలరించబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడబోతోంది
SRH vs LSG
ఐపీఎల్ 2026 సీజన్ లో రెండో డబుల్ హెడర్ ఆదివారం అభిమానులను అలరించబోతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడబోతోంది. సొంతగడ్డపై సన్ రైజర్స్ కు ఈ సీజన్ లో ఇదే తొలి మ్యాచ్. ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓడినా కూడా…. తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ కోల్ కతా నైట్ రైడర్స్ కు షాకిచ్చింది.
భారీ స్కోరుతో పాటు బౌలింగ్ పరంగానూ మెరుగ్గా రాణించి తొలి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జోరును సొంతగడ్డపైనా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కమిన్స్ వెళ్లిపోవడంతో ఇషాన్ కిషన్ సారథిగా కొనసాగనున్నాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు కీలక ఆటగాళ్లంతా ఫామ్ లోకి వచ్చారు. హెడ్ , అభిషేక్ శర్మ, క్లాసెన్ , నితీశ్ కుమార్ రెడ్డి గత మ్యాచ్ లో అదరగొట్టారు.
ఇషాన్ కిషన్ కూడా చెలరేగితే తిరుగుండదు. పైగా ఆడబోతోంది హోంగ్రౌండ్ లో కావడంతో ఇక్కడి కండీషన్లు బాగా తెలుసు. గత సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లందరూ పరుగుల వరద పారించారు. దీంతో మరోసారి వారి విధ్వంసం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బౌలింగ్ పరంగా మాత్రం కాస్త ఆందోళన ఉన్నా సరే గత మ్యాచ్ తో అది కూడా తీరిపోయింది.
బలహీనమైన బౌలింగ్ అంటూ వచ్చిన అభిప్రాయాన్ని సన్ రైజర్స్ బౌలర్లు మార్చినట్టే కనిపిస్తున్నారు. గత మ్యాచ్ లో ఉనాద్కట్ , ఎహసాన్ మలింగతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ లో ఆకట్టుకున్నారు. ఈడెన్ లాంటి బ్యాటింగ్ పిచ్ పై కోల్ కతాను ఆలౌట్ చేసి తమ బౌలింగ్ మీద ఉన్న సందేహాలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం ఏ విధంగా చూసినా,ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరెట్ గా కనిపిస్తోంది.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై పేలవ ప్రదర్శనతో లక్నో నిరాశపరిచింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు లక్నో కొంపముంచాయి. పంత్ ఓపెనర్ గా ఫెయిలయ్యాడు. కెప్టెన్ గానూ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్ లో అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించలేదు. అటు బౌలింగ్ లో మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శనే చేయడం కాస్త రిలీఫ్ గా చెప్పాలి.
అయితే బ్యాటర్లు గాడిన పడితే తప్ప లక్నో గెలుపు బాట పట్టే పరిస్థితి లేదు. మార్క్ రమ్, మిఛెల్ మార్ష్ , పంత్ , పూరన్ తమ బ్యాట్ కు పనిచెప్పాల్సిందే. గత మ్యాచ్ లో అబ్దుల్ సమద్, మార్ష్ మాత్రమే పర్వాలేదనిపించారు. బౌలింగ్ పరంగా మాత్రం ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, షమీ రాణించారు. అయితే భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ ను లక్నో బౌలర్లు ఎంతవరకూ అడ్డుకుంటారో చూడాలి.

గత రికార్డులు ః
ఐపీఎల్ చరిత్రలో లక్నో , సన్‌రైజర్స్ 6 సార్లు తలపడ్డాయి. లక్నో 4 మ్యాచ్‌ల్లో గెలవగా, సన్ రైజర్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది.గత సీజన్లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి.
పిచ్ రిపోర్ట్ ః
ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉంటుంది. ఇక్కడి ఫ్లాట్ వికెట్ పై బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు. ప్రతీసారీ భారీస్కోర్లు నమోదయ్యే ఈ పిచ్ పై ఛేజింగ్ చేసే జట్టుకు ఎక్కువ విజయావకాశాలుంటాయి.
Gauge Test : బ్యాట్లను తనిఖీ చేస్తున్న అంపైర్లు…అసలు ఏంటీ గేజ్ టెస్ట్ ?





