Just SpiritualJust LifestyleLatest News

Thali:తాళి కట్టేటప్పుడు 3 ముడులు ఎందుకు వేస్తారు? వాటి పరమార్థం ఏంటి?

Thali:మూడు ముడులు అనేవి కేవలం ఒక ఆచారంగానే కాదు, వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి అవసరమైన 3 ముఖ్యమైన బాధ్యతలకు ఇవి సంకేతాలుగా నిలుస్తాయి.

Thali

హిందువుల వివాహ వ్యవస్థలో మాంగళ్యధారణ అనేది అత్యంత కీలకమైన ఘట్టం అని అందరికీ తెలిసిందే. వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేయడంతోనే ఆ బంధానికి ఒక పవిత్రత, సొసైటీలో ఒక గుర్తింపు లభిస్తుంది.

అయితే, ఇప్పుడు పెళ్లిళ్లు ఆడంబరంగా మారుతున్నా, ఈ పవిత్రమైన మూడు ముళ్ల వెనుక ఉన్న అసలు పరమార్థం మాత్రం చాలా మందికి తెలీదు. నిజానికి మూడు ముడులు అనేవి కేవలం ఒక ఆచారంగానే కాదు, వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి అవసరమైన 3 ముఖ్యమైన బాధ్యతలకు ఇవి సంకేతాలుగా నిలుస్తాయని పండితులు చెబుతారు.

మన సంప్రదాయంలో మూడు అనే సంఖ్యకు ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రిలోకాలు ఇలా ప్రతి దానిలో కూడా ఈ త్రయానికి ప్రాధాన్యత ఇస్తుంటాం.

అంతేకాదు మనిషికి స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలుంటాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలా వివాహ బంధం ద్వారా ఈ మూడు శరీరాలు ఒకదానితో ఒకటి లీనమై, ఆ జంట మనోవాక్కాయకర్మలా ఏకం కావాలనేదే ఈ మూడు ముడుల వెనుక ఉన్న గంభీరమైన అర్థం అని పురాణాలు చెబుతాయి.

అయితే ఈ తాళి(Thali)లోని మూడు ముళ్లలో ప్రతి ముడికి ఒక్కో విశిష్టమైన అంతరార్థం దాగి ఉందట. మొదటి ముడిని ‘ధర్మేచ్ఛ’అని పిలుస్తారు. అంటే, దంపతులు ఇద్దరూ కలిసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపమని, కుటుంబ గౌరవాన్ని కాపాడమని ధర్మేచ్ఛ అనే పదం గుర్తు చేస్తుంది.

ఇక రెండో ముడిని ‘అర్థేచ్ఛ’ అంటారు. ఇది సంసార వృద్ధికి , ఆర్థిక బాధ్యతలకు సంకేతం. భార్యాభర్తలు కష్టపడి సంసారాన్ని సాకుతూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లాలని ఈ అర్థేచ్ఛ సూచిస్తుంది.

Thali
Thali

చివరిదైన మూడో ముడిని ..’కామేచ్ఛ’ ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. కేవలం బాధ్యతలే కాకుండా దంపతుల మధ్య అనురాగం, ఆప్యాయత ఎప్పటికీ కూడా తగ్గకూడదని, అలాగే నిండు నూరేళ్లూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ వంశవృద్ధికి కారకులు కావాలనేది కామేచ్ఛ చెబుతుంది.

అలా ఈ తాళి(Thali)లోని మూడు ముడులు భార్యాభర్తలను ఒక నిబద్ధతకు కట్టుబడి ఉండేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఆచారాల వెనుక ఉన్న ఇలాంటి లోతైన విషయాలను ఈ తరం యువత తెలుసుకోవడం వల్ల, వివాహ బంధంపై మరింత గౌరవం పెరుగుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

Bank of Baroda:బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. 45 ఏళ్ల వయస్సున్నవారికీ కూడా ఛాన్స్

Related Articles

Back to top button