Just InternationalJust NationalLatest News

Dollar Dreams : చెదురుతున్న డాలర్ డ్రీమ్స్..అమెరికా నుంచి భారతీయుల తిరుగుటపా

Dollar Dreams : అమెరికా అంటే భారతీయులకు చాలా మోజు... అమెరికాలో చదువు లేదా అమెరికాలో ఉద్యోగం అంటే ఎంతో మక్కువ

Dollar Dreams

అమెరికా అంటే భారతీయులకు చాలా మోజు… అమెరికాలో చదువు లేదా అమెరికాలో ఉద్యోగం అంటే ఎంతో మక్కువ. అందుకే గత కొన్నేళ్లుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అప్పు చేసైనా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికా పంపించాలని తాపత్రయపడుతుంటారు.

అలాగే అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చూసుకుని అక్కడే సెటిలైపోదామనుకునే వారు కోకొల్లలు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మెల్లిగా తలకిందులవుతున్నాయి. అమెరికా అంటే భారతీయులకు ఆసక్తి తగ్గుతోంది. ముఖ్యంగా అక్కడ గత కొన్నేళ్లుగా సెటిలయిన భారతీయులు అమెరికాను వీడేందుకు సిద్ధమవుతున్నారు.

తాజాగా ఓ సర్వే ప్రకారం దాదాపు 40 శాతం మంది ఇండియన్స్ అమెరికాను వదిలి శాశ్వతంగా స్వదేశానికి తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కార్నెగీ(Dollar Dreams) ఎండోమెంట్ నిర్వహించిన సర్వేలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే భారతీయుల ఆలోచనల్లో మార్పుకు కారణంగా కనిపిస్తోంది.

అమెరికన్లకు మాత్రమే అమెరికా అన్న నినాదాలు పెరిగిపోవడం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పైగా గతంతో పోలిస్తే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. గన్ కల్చర్ చాలా నగరాలకు విస్తరించడంతో భద్రతా పరమైన ఆందోళనలు కూడా ఎక్కువయ్యాయి.

వలసదారుల కట్టడికి ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అక్కడి అమెరికన్లు భారతీయులను కూడా అనుమానంగా చూసే పరిస్థితి పెరుగుతోంది. అన్నింటికీ మించి గతంలోలా ఉద్యోగ భద్రత లేకపోవడం మరో ప్రధాన కారణం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు హఠాత్తుగా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి.

Dollar Dreams
Dollar Dreams

ఉద్యోగం తొలగింపు వేళ నష్టపరిహారం విషయంలోనూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగం ఊడితే అప్పటి వరకూ అమెరికాలో సాఫీగా సాగిన జీవితం ఒక్కసారిగా రోడ్డున పడుతుంది. అదే సమయంలో స్వదేశంలో స్టార్టప్ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడి భారత కంపెనీలకు భారతీయ టెకీలే కావాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో ఎందుకు స్వదేశం తిరిగి వెళ్లిపోకూడదన్న ఆలోచనలు కూడా అమెరికాలో ఉండే భారతీయుల్లో తిరుగుతున్నాయి.

పైగా గ్రీన్ కార్డ్ , హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం చేయడం కూడా కారణంగా చెబుతున్నారు. దశాబ్దాల పాటు గ్రీన్ కార్డు కోసం నిరీక్షించలేమని, దాని కంటే స్వదేశంలో గౌరవంగా బతకడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే రెండేళ్లలో చాలా మంది భారతీయులు అమెరికాను వీడి స్వదేశానికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఒక్కసారిగా భారత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతే అమెరికా టెక్నాలజీ రంగం కుప్పకూలిపోయే అవకాశముంది. ఎందుకంటే అక్కడి టెక్ కంపెనీల్లో ఎక్కువ మంది భారతీయ ఉద్యోగులే పనిచేస్తున్నారు.

Tamil Nadu : ద్రవిడ గడ్డపై త్రిముఖ పోరు.. తమిళనాడులో పీఠం ఎవరిది?

Related Articles

Back to top button