Bandi Bhagirath : లొంగిపోయిన బండి భగీరథ్..తర్వాత ఏం జరగబోతోంది ?
Bandi Bhagirath : బండి భగీరథ్ పై పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు
Bandi Bhagirath
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్(Bandi Bhagirath) పోలీసులకు లొంగిపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన భగీరథ్ తన లాయర్ల సమక్షంలో లొంగిపోయాడు. ఓ మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. అప్పటి నుంచీ అతను పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ రాజకీయ నేత కుమారుడు కావడంతో ఈ కేసు అంశం చర్చనీయాంశంగా మారింది. పైగా పోలీసులు మొదట్లో బాలిక తల్లి నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఆలస్యం చేయడం తీవ్ర దుమారం రేపింది. తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా హాట్ టాపిక్ అయింది.
అటు భగీరథ్ పరారీలో ఉన్నా అరెస్ట్ చేయకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును పారదర్శకంగా విచారించేందుకు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ బృందం విచారణ జరుపుతుండగానే పరారీలో ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా బాధితురాలి వయసుపై భగీరథ్ తరపు న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు రకాలుగా ఆమె పుట్టినతేదీలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో దీనిపై విచారణ జరిపి బాధితురాలి వయసును ధృవీకరించాలని హైకోర్టు ఆదేశించింది. అటు బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని భగీరథ్ తరపు లాయర్లు కోరగా కోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. మరోవైపు కోర్టులో పరిణామాలను గమనించిన పోలీసులు భగీరథ్ ను అరెస్ట్ చేసేందుకు సోదాలు కూడా నిర్వహించారు. అతని నివాసంలోనూ, ,సన్నిహితుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేసారు.
అనంతరం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ పరిణామాలను గమనించిన భగీరథ్ తన లాయర్లతో సంప్రదింపులు జరిపి లొంగిపోయాడు. భగీరథ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా ఇప్పటికే బాధితురాలి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది.
Bandi Bhagirath : బండి భగీరథ కోసం గాలింపు..పలు చోట్ల పోలీసుల తనిఖీలు





