Indian Railways : రాత్రి 10 తర్వాత రైలులో ఇవి చేస్తే ఫైన్ తప్పదు.. కొత్త రూల్స్ వచ్చేసాయ్..
Indian Railways : రాత్రి వేళల్లో ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం భారతీయ రైల్వే అమలు చేస్తున్న నిబంధనలు, ఛార్జింగ్ టైమింగ్స్, ఫిర్యాదు ఎలా చేయాలి?
Indian Railways
ట్రైన్లో నైట్ జర్నీ అంటే హాయిగా పడుకుని ఉదయానికి గమ్యం చేరాలని అంతా అనుకుంటారు. కానీ పక్కవారి గట్టి ఫోన్ మాటలు, మిడ్ నైట్ టికెట్ చెకింగ్లు, నైట్ 11 దాటాక, ఉదయం ఆరు దాటినా మిడిల్ బెర్త్ దించకపోవడం వంటి పనులు జర్నీని చిరాకుగా మార్చేస్తాయి. ప్రయాణికులకు మంచి నిద్ర, సేఫ్టీ కల్పించడానికి రైల్వే శాఖ రాత్రి సమయంలో కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను అమలు చేస్తోంది.
రాత్రి 10 గంటల తర్వాత కూడా చాలామంది లైట్స్ ఉంచేస్తారు. కానీ ఇకపై కోచ్‌లోని మెయిన్ లైట్లు ఆపేసి నైట్ ల్యాంప్స్ మాత్రమే ఉంచాలి. నిద్రకు ఆటంకం కలగకుండా నైట్ టైమ్‌లో బోగీల్లో టీ, కాఫీ, ఫుడ్ ఐటమ్స్ అమ్ముతూ పెద్దగా అరవడాన్ని బ్యాన్ చేశారు. ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే డైరెక్ట్‌గా సీటు వద్దకు ఫుడ్ డెలివరీని చేస్తారు.
అలాగే రిజర్వేషన్ ఉన్నవారి సేఫ్టీ కోసం రాత్రి 10 గంటల తర్వాత వెయిటింగ్ లిస్ట్, జనరల్ టికెట్లతో రిజర్వ్డ్ కోచ్‌లలోకి ఎవరూ కూడా ఎక్కడానికి ఇకపై అస్సలు వీల్లేదు. రూల్స్ బ్రేక్ చేస్తే జరీమానా వేయడంతో పాటు మధ్యలోనే వారిని ట్రైన్ దించేసే అధికారం రైల్వే(Indian Railways) సిబ్బందికి ఉంటుంది.
టికెట్ చెకింగ్ విషయంలోనూ క్లియర్ రూల్ ఉంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య ప్రయాణీకులను నిద్రలేపి టీటీఈలు టికెట్లు తనిఖీ చేయకూడదు. రాత్రి 10 లోపు ఎక్కిన వారందరి టికెట్లను అప్పటికే చెక్ చేయాలి. ఆ తర్వాత ఎక్కేవారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. కాకపోతే విజిలెన్స్ అనుమానం వచ్చినా, అనధికార వ్యక్తులు ఉన్నట్లు రైల్వేకు సమాచారం అందినా తనిఖీ చేసే అధికారం సిబ్బందికి ఉంటుంది.
ఇక ఫైర్ సేఫ్టీ కోసం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కోచ్‌లలో మొబైల్ ఫోన్లకు, ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పాయింట్లకు పవర్ సప్లై ఆపేస్తున్నారు. గతంలో పవర్ బ్యాంకులు పేలిన సంఘటనల వల్ల అన్ని జోన్లలో కూడా ఈ రూల్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. రాత్రి 10 దాటాక ఫోన్లలో బిగ్గరగా మాట్లాడటం.. ఇయర్‌ఫోన్స్ లేకుండా స్పీకర్లో సాంగ్స్ వినడం, రీల్స్ చూడటం చేయకూడదు.
గ్రూప్‌గా వెళ్లేవారు కూడా కోచ్‌లో సైలెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈ కండీషన్లు ఎవరైనా పాటించకపోయినా.. ఇబ్బంది పెట్టినా కోచ్‌లోని టీటీఈ లేదా ఆర్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయొచ్చు. 139 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి లేదా రైల్‌మదద్ (RailMadad) యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే వీలుందని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.





