Suryakumar Yadav : సూర్యా భాయ్…ఇక బై బై..మళ్లీ బ్లూ జెర్సీలో కష్టమే ?
Suryakumar Yadav : 2025 నుంచి సూర్యకుమార్ డౌన్ ఫాల్ మొదలైంది. పలు సిరీస్ లకు అవకాశమిచ్చి ఫామ్ అందుకుంటాడని సెలక్టర్లు భావించినా అది జరగలేదు.
Suryakumar Yadav
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే సూర్యకుమార్ ప్రస్తుతం టీ20 జట్టుకు మాత్రమే ఎంపికవుతున్నాడు. ఇప్పుడు కెప్టెన్సీనే కాదు జట్టులో ప్లేస్ కూడా దక్కలేదు. పైగా సెలక్టర్లు వచ్చే ప్రపంచకప్ , ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేసినట్టు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ ను సారథిగా నియమించి, యువ ఆటగాళ్లకు ప్రాాధాన్యతనిచ్చారు. దీంతో 35 ఏళ్లు దాటిపోవడంతో సూర్యకుమార్ ను తప్పించక తప్పలేదు. నిజానికి గత ఏడాదిన్నర కాలంగా సూర్య కుమార్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుతమైన క్యాచ్ తో భారత్ కు ట్రోఫీ అందించిన సూర్యా భాయ్ తర్వాత రోహిత్ నుంచి పగ్గాలు అందుకున్నాడు.
వ్యక్తిగతంగా రాణించకున్నా సారథిగా మాత్రం విజయవంతమయ్యాడు. టీమ్ ను సమర్థవంతంగా నడిపిస్తూ 2026 టీ20 ప్రపంచకప్ ను అందించాడు. ఆ మెగాటోర్నీలో 242 పరుగులే చేసినా మిగిలిన ఆటగాళ్లంతా అంచనాలకు తగ్గట్టు ఆడడంతో మరో ప్రపంచకప్ భారత్ ఖాతాలో చేరింది.
ఇదిలా ఉంటే సూర్యకుమార్ టీ20 అరంగేట్రం కూడా అసాధారణమే. 31 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి రావడమే కాదు అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు. తర్వాత తక్కువ కాలంలోనే కెప్టెన్ గా కూడా ఎదిగాడు. గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్లు ఆడుతూ మిస్టర్ 360గా పిలిపించుకున్నాడు.
అయితే కెప్టెన్సీ ఒత్తిడి అతని వ్యక్తిగత బ్యాటింగ్ పై పడింది. దీంతో 2025 నుంచి సూర్యకుమార్ డౌన్ ఫాల్ మొదలైంది. పలు సిరీస్ లకు అవకాశమిచ్చి ఫామ్ అందుకుంటాడని సెలక్టర్లు భావించినా అది జరగలేదు. ఇక తాజాగా జరిగిన సెలక్షన్ కమిటీ మీటింగ్ లో కనీసం సూర్యకుమార్(Suryakumar Yadav) పేరు కూడా ప్రస్తావనకు రాలేదని సమాచారం.
ఇటీవల ఐపీఎల్ లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపరచడంతో సూర్యకుమార్ పై వేటు ఖాయమైపోయింది. కెరీర్ లో ఇప్పటి వరకూ 113 టీ20లు ఆడి 3,272 పరుగులు చేశాడు. దీనిలో 25 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి.
మరోవైపు భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత ఏడాది సీనియర్ ప్లేయర్లు అశ్విన్, కోహ్లీ, రోహిత్ లను టెస్ట్ జట్టు నుంచి తప్పించడంలో గంభీరే కీలకమన్నది చాలా మంది అభిప్రాయం. అలాగే జట్టులో గిల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించడంలోనూ గంభీర్ కీలకపాత్ర పోషించాడు.

ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ను టీ20 జట్టు సారథిగా తప్పించడంలోనూ గంభీర్ పాత్ర ఉందనేది పలువురి వాదన. వ్యక్తిగత ఫామ్ కోల్పోవడంతోనే కెప్టెన్సీ నుంచి తప్పించామంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెబుతున్నా గతంలో చాలా మంది ప్లేయర్లు పదేపదే విఫలమైనా జట్టులో కొనసాగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఈసారి మాత్రం సూర్యకుమార్(Suryakumar Yadav) కు అలాంటి సపోర్ట్ లేదు. అందుకే కెప్టెన్సీ నుంచి మాత్రమే కాదు జట్టులో ఆటగాడిగానూ ప్లేస్ లేకుండా పోయిందనే మాట వినిపిస్తోంది. ఇక సూర్యకుమార్ ను మళ్లీ బ్లూ జెర్సీలో చూడడం కష్టమే.
Rashi Phalalu : ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎవరి పనులు సక్సెస్ అవుతాయో తెలుసుకోండి!





