IND vs AFG : ధర్మశాలలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్..తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
IND vs AFG : టీమిండియా ఆడుతూ పాడుతూ విజయాన్నందుకుంది..తడిచిన పిచ్ పై భారత బౌలర్లు అదరగొట్టారు. వారి దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది
IND vs AFG
ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్ లో అరంగేట్రంలోనే హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అదరగొడితే… బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిసాడు. ఫలితంగా టీమిండియా ఆడుతూ పాడుతూ విజయాన్నందుకుంది. ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ను 25 ఓవర్లకు కుదించారు.
తడిచిన పిచ్ పై భారత బౌలర్లు అదరగొట్టారు. వారి దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. జడ్రాన్ (1), సెదికుల్లా (0), రహమత్ షా(3) నిరాశ పరిచారు. అయితే ఓపెనర్ గుర్బాజ్ దూకుడుగా ఆడాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 116 పరుగులు జోడించారు. గుర్బాజ్ టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతని జోరుకు ఆఫ్ఘనిస్తాన్ భారీస్కోరు చేసేలా కనిపించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన యార్కర్ తో అతన్ని పెవిలియన్ కు పంపాడు. గుర్బాజ్ వికెట్ తోనే ఆఫ్ఘన్ జోరుకు బ్రేక్ పడింది.
తర్వాతి బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా వరుస వికెట్లు తీసి కట్టడి చేశారు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంలోనే మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. అర్షదీప్ సింగ్ 2 , నితీశ్ రెడ్డి రెండేసి వికెట్లు తీసారు.

తర్వాత ఛేజింగ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ తొలి వికెట్ కు 46 పరుగులు జోడించారు. భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న రోహిత్ (16) త్వరగానే ఔటవగా..ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ రెండో వికెట్ కు 70 పరుగులు జోడించాడు. వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ 34 రన్స్ చేయగా, శ్రేయాస్ అయ్యర్ (12) నిరాశపరిచాడు.
ఈ దశలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసక్తి నెలకొంది. అయితే గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ ను మళ్లీ వన్ సైడ్ గా మార్చేశాడు. అటు కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) కూడా దూకుడుగా ఆడడంతో భారత్ 22.5 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. గిల్ 66 బంతుల్లో 84 (11 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం లక్నోలో జరుగుతుంది.
Earth : బ్రెయిన్ కంటే పవర్ఫుల్ నెట్వర్క్ భూమి లోపల ఉందా? ఇది మనుషుల్ని ఎంతలా కాపాడుతుందో తెలుసా?





