Team India : టీమిండియాదే వన్డే సిరీస్..చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్
Team India : క్రికెట్ లో అత్యధిక సార్లు 400 ప్లస్ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది
Team India
సొంతగడ్డపై టీమిండియా(Team India) జోరు కొనసాగుతోంది. బ్యాటింగ్ లో గిల్ , ఇషాన్ కిషన్ సెంచరీలతో చెలరేగిన వేళ భారీస్కోరు సాధించిన భారత్ తర్వాత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆఫ్ఘన్ ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్(Team India) ఆదిలోనే జైస్వాల్ (4) వికెట్ కోల్పోయింది. తర్వాత రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ 39 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్ లో 14 వేలు పరుగుల మైలురాయి అందుకున్నాడు. రోహిత్ ఔటైన తర్వాత గిల్ కు ఇషాన్ కిషన్ జత కలిశాడు. వీరిద్దరూ ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకున్నారు. కేవలం 140 బంతుల్లోనే 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దాటిగా ఆడిన ఇషాన్ కిషన్ 79 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్, శ్రేయాస్ అయ్యర్ 40 పరుగులు జోడించారు.
గిల్ 110 బంతుల్లో 154 (22 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా.. అప్పటి నుంచి భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. చివరికి టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ కు 400 ప్లస్ స్కోరు చేయడం ఇదే తొలిసారి. అలాగే వన్డే క్రికెట్ లో అత్యధిక సార్లు 400 ప్లస్ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఇప్పటి వరకూ రెండు జట్లు 8 సార్లు 400కు పైగా స్కోర్లు చేసాయి.

తర్వాత ఛేజింగ్ లో కాసేపు దూకుడుగా ఆడిన ఆఫ్ఘనిస్తాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ 232 పరుగులకే వాళ్ల కథ ముగించారు. దీంతో భారత్ 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో రహమత్ షా (79), గుర్బాజ్ (41), సేదిఖుల్లా (42) మాత్రమే పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, గుర్నూర్ బ్రార్ 3 , ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసారు. సిరీస్ లో చివరి వన్డే చెన్నైలో శనివారం జరుగుతుంది.
Vijay Devarakonda : టీజీ20 లీగ్ పై టీసీఏ ఫైర్..విజయదేవరకొండకు నోటీసులు





