Just Andhra PradeshJust SpiritualLatest News

Minister Anam : సాయిబాబా ఆలయాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మంత్రి ఆనం.. బాబా భక్తులకు క్షమాపణలు

Minister Anam : తిరుమల టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు నిధులను షిర్డీ సాయినాధుని ఆలయాలకు కేటాయించడం లేదని మంత్రి చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారానికి దారితీశాయి

Minister Anam

ప్రజా జీవితంలో అందులోనూ పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి చిన్న మాట కూడా ఎంతో ఎఫెక్ట్ చూపిస్తుంది. సొసైటీలో భక్తి, దేవుడు వంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ..ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం(Minister Anam) రామనారాయణ రెడ్డికి సంబంధించిన తాజా వివాదం మరోసారి రుజువు చేసింది.

తిరుమల టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్టు నిధులను షిర్డీ సాయినాధుని ఆలయాలకు కేటాయించడం లేదని మంత్రి చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారానికి దారితీశాయి. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమే ఈ నిధులను వాడుతున్నామని, అందుకే సాయి బాబా ఆలయాలకు ఈ నిధులు ఇవ్వడం లేదనే కోణంలో మంత్రి మాట్లాడటంతో.. సాయి భక్తులు, కొన్ని హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన మంత్రి ఆనం భక్తులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు.

తాను చేసిన కామెంట్ల వల్ల సాయిబాబా భక్తుల మనోభావాలేవైనా సరే దెబ్బతిని ఉంటే పెద్ద మనసుతో తనను మన్నించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆనం..తాను స్వయంగా సాయిబాబా భక్తుడినని, ప్రతిరోజూ ఉదయం తన పూజా మందిరంలో మిగిలిన దేవతామూర్తులతో పాటు సాయి బాబాను కూడా పూజించిన తర్వాతే తన పనులను ప్రారంభిస్తానని వివరించారు.

సాయిబాబాపై కోట్లాది మంది భక్తులకు ఉన్న అపారమైన విశ్వాసాన్ని..ఏపీ ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ గానీ ఎల్లప్పుడూ పూర్తిగా గౌరవిస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరి నమ్మకాలను కించపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి, తనకు ఎంతమాత్రం లేదని అన్నారు. అంతేకాదు బాబా ఆలయాల్లో కూడా హిందూ సంప్రదాయాల ప్రకారం.. పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి గుర్తుచేశారు.

అయితే ఈ బాబా కామెంట్ల వివాదం వెనుక గల పాలనా పరమైన కారణాలను కూడా మంత్రి ఆనం(Minister Anam) ఈ సందర్భంగా వివరించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 5 వేల భజన మందిరాల కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన నిబంధన, లక్ష్యం ఉన్నాయని ఆయన చెప్పారు.

కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణంతో పాటు, సనాతన ధర్మ ప్రచారం కోసం మాత్రమే శ్రీవాణి ట్రస్టు మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని మంత్రి వివరణ ఇచ్చారు. అందువల్ల షిర్డీ సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇవ్వకపోవడాన్ని బాబాకు జరిగిన అవమానంగా భక్తులెవరూ భావించవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇది కేవలం శ్రీవాణి ట్రస్టు నిబంధనలు, పరిపాలనా విధానాల ప్రకారం తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవరి నమ్మకాలను తక్కువ చేసి మాట్లాడటం కాదని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన అసలు ఉద్దేశాన్ని పూర్తిగా పక్కనబెట్టి, రాజకీయ వర్గాలతో పాటు కొన్ని మీడియా సంస్థలు కావాలనే ఈ విషయాన్ని వక్రీకరించి అనవసర వివాదంగా మార్చుతున్నాయని మంత్రి ఆనం(Minister Anam) ఆరోపించారు.

Minister Anam
Minister Anam

నిజాలను తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని ఆనం కోరారు. ఈ వివాదం భక్తికి సంబంధించింది కాదన్న మంత్రి..ఇది కేవలం నిధుల కేటాయింపు నిబంధనలకు సంబంధించింది మాత్రమేనని కంక్లూజన్ ఇచ్చారు. మొత్తంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నపుడు దైవ సంబంధిత విషయాలపై మాట్లాడే మాటల్లో.. చిన్న పొరపాటు దొర్లినా అది ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో ఇది ఒక ఉదాహరణగా నిలిచింది.

FootBall : కాలమనే అద్దంలో క్రీడా దిగ్గజాలు..ఫుట్‌బాల్ దేవుళ్ల వెనుకున్న నిజాలను బయటపెట్టిన ఫోటో..

Related Articles

Back to top button