Impress : అందరినీ ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారా? అయితే మిమ్మల్ని మీరు ద్వేషిస్తున్నట్లేనట..
Impress : అందరినీ సంతోషపెట్టడం ఎవరి వల్లా కాదనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరెంత మంచిగా ఉన్నా, ఎంత కష్టపడినా మిమ్మల్ని ఇష్టపడని వాళ్లు కొందరు ఉంటూనే ఉంటారు.
Impress
మన చుట్టూ ఉండేవారిలో కొందరిని గమనిస్తే.. ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టాలని, అందరి దృష్టిలో తాను మంచివ్యక్తి అనిపించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. ఎవరికీ నో చెప్పలేరు, ఎవరినీ నొప్పించలేరు. బయటకు చాలా మంచివారిలా, అందరితో ఈజీగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నవారిలా కనిపిస్తారు.
కానీ సైకాలజీ ప్రకారం, ఈ అతిగా ఇంప్రెస్(Impress) చేయాలనే అలవాటు వెనుక ఒక లోపం దాగి ఉందట. తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి ఇంకా చెప్పాలంటే తనను తాను ద్వేషించే వ్యక్తి మాత్రమే ఇలా నలుగురినీ ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ మాట నూటికి నూరు శాతం నిజం. ఎందుకంటే ఇలా ఉన్నవారే తమ లోపల ఉండే తెలియని వెలితిని, భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే బయట సమాజం నుంచి గుర్తింపును, పొగడ్తలను ఆశిస్తారు.
ఈ మాట వెనుక బలమైన మానసిక కారణం ఉంది. ఒక వ్యక్తి ముందుగా తనను తాను పూర్తిగా నమ్మి, తన తప్పొప్పులను ప్రేమిస్తే కనుక.. ఎదుటివ్యక్తులు తమను మెచ్చుకోవాలని అనుకోరు. తన విలువ ఏంటో తనకు తెలిసినప్పుడు పక్కవారిచ్చే సర్టిఫికెట్లతో అస్సలు పనే ఉండదు.
కానీ, ఎవరైతే తమ రూపాన్ని కానీ, తమ తెలివితేటలను కానీ తమ గతాన్ని కానీ తమకు తెలీకుండానే లోలోపల ద్వేషిస్తారో.. వారి మనసులో ఎప్పుడూ ఒక పెద్ద శూన్యం ఉంటుంది. ఆ శూన్యాన్ని పూడ్చుకోవడానికే వారు లోకం వైపు చూస్తారు.
చుట్టూ ఉన్న అందరూ తనను పొగిడితే, అందరికీ తాను నచ్చితే.. తనపై తనకు ఉన్న అసంతృప్తి తగ్గి, తానేదో గొప్ప వ్యక్తిననే భ్రమ కలుగుతుందని మనసు నమ్ముతుంది. అంటే, బయటి వ్యక్తుల మెప్పు అనేది వీరికి ఒక పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుందన్న మాట. అందుకే ప్రతి ఒక్కరినీ ఇంప్రెస్(Impress) చేయడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.
వీరు తమకు ఇష్టం లేకపోయినా, తమకు వీలు కాకపోయినా ఎదుటివారు ఎక్కడ బాధపడతారోనని భయపడి ప్రతి దానికి సరే అని చెప్పేస్తుంటారు. బట్టలు కొనే విషయం నుంచి కెరీర్ వరకు ప్రతి విషయానికి ఇతరుల అభిప్రాయాలపైనే ఎక్కువగా ఆధారపడతారు.
పక్కవారు మెచ్చుకుంటేనే పని సరిగ్గా చేసినట్లుగా వీరు ఫీలవుతారు. ఎవరైనా చిన్న తప్పు ఎత్తి చూపినా లేదా చిన్న విమర్శ చేసినా సరే డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. నలుగురిలో ఉన్నప్పుడు ఆ నలుగురికి తాము ఎలా ఉంటే నచ్చుతారో అలా నటిస్తారు తప్ప, తమ అసలు అభిప్రాయాలను బయటపెట్టలేరు.
ఇలా అందరినీ సంతోషపెట్టే మెంటాలిటీ నుంచి బయటపడటం ఒక రోజులో సాధ్యం కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని మార్పుల ద్వారా ఈ మెంటాలిటీని కచ్చితంగా మార్చుకోవచ్చని అంటున్నారు. ముందుగా, మీ లోపాలను, మీ గతాన్ని ఒప్పుకుని మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించడం స్టార్ట్ చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరూ వంద శాతం పర్ఫెక్ట్ కాదనే నిజాన్ని అంగీకరించాలి. పక్కవాళ్ల పొగడ్తలపైన మీ విలువ అనేది ఆధారపడి లేదని గట్టిగా నమ్మాలి.

రెండోది.. జీవితంలో హద్దులు గీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు చేయలేని పనికి లేదా మీకు ఇష్టం లేని విషయానికి మొహమాటం లేకుండా, సున్నితంగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో ఇది కాస్త కష్టంగా అనిపించినా, మీ మానసిక ప్రశాంతతకు ఇది చాలా అవసరం.
చివరిగా, అందరినీ సంతోషపెట్టడం ఎవరి వల్లా కాదనే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరెంత మంచిగా ఉన్నా, ఎంత కష్టపడినా మిమ్మల్ని ఇష్టపడని వాళ్లు కొందరు ఉంటూనే ఉంటారు. కాబట్టి, లోకం కోసం బతకడం ఆపేసి, మీ సంతోషం కోసం, మీ లక్ష్యాల కోసం జీవించడం స్టార్ట్ చేసినపుడే మీపై మీకు గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇతరులను ఇంప్రెస్ చేయాలనే అనవసరమైన తాపత్రయం పూర్తిగా పోతుంది.
FootBall : కాలమనే అద్దంలో క్రీడా దిగ్గజాలు..ఫుట్‌బాల్ దేవుళ్ల వెనుకున్న నిజాలను బయటపెట్టిన ఫోటో..





