Women’s T20 : మహిళల టీ20 వరల్డ్ కప్..భారత్ సెమీస్ చేరాలంటే.. ?
Women's T20 : భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరాలంటే సింపుల్ ఈక్వేషన్ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలవడమే.కంగారూలను ఓడిస్తే ఎలాంటి ఫలితాలు, ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది
Women’s T20
పొట్టి ప్రపంచకప్ ను తొలిసారి ముద్దాడాలని బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ ను సైతం మెరుగుపరుచుకుంది. మరి ఈ విజయంతో భారత్ సెమీస్ చేరే అవకాశాలున్నాయా అంటే కచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి.
ఎందుకంటే టోర్నీని రెండు భారీ విజయాలతో ఆరంభించిన తర్వాత సౌతాఫ్రికా చేతిలో ఓటమి వెనక్కి నెట్టింది. నిజానికి అది కూడా గెలిచే మ్యాచ్ అయినా పేలవ ఫీల్డింగ్ తో చేజార్చుకుంది. ఈ ఒక్క ఓటమి కారణంగా భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. బంగ్లాదేశ్ పై గెలుపుతో ప్రస్తుతం 6 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి.
రన్ రేట్ కూడా సఫారీల కంటే మెరుగ్గానే ఉంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరాలంటే సింపుల్ ఈక్వేషన్ చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై గెలవడమే.కంగారూలను ఓడిస్తే ఎలాంటి ఫలితాలు, ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఆసీస్ చేతిలో ఓడిపోతే మాత్రం భారత్ సెమీస్ అవకాశాలు సౌతాఫ్రికా చేతిలో పెట్టినట్లు అవుతుంది.
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోతే, జట్టు 6 పాయింట్లతోనే నిలుస్తుంది.అప్పుడు సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో (నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై) కనీసం ఒక మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది.సౌతాఫ్రికా కూడా 6 పాయింట్లతోనే నిలిస్తే, అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపై సాధించిన భారీ విజయాల వల్ల భారత్‌కు నెట్ రన్ రేట్ ప్లస్ పాయింట్‌గా ఉంది.
దీంతో నెట్ రన్ రేట్ భారత్ సెమీఫైనల్ బెర్తును డిసైడ్ చేస్తుంది. ఇదిలా ఉంటే భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, మరోవైపు సౌతాఫ్రికా తన రెండు మ్యాచ్‌లలోనూ గెలిస్తే, హర్మన్ ప్రీత్ సారథ్యంలోని టీమిండియా వరల్డ్ కప్ నుండి ఎలిమినేట్ అవుతుంది. కంగారూలతో మ్యాచ్ భారత్ కు అత్యంత కఠినమైన పరీక్ష.

అదే సమయంలో సౌతాఫ్రికాకు రెండు చిన్న జట్లతో మ్యాచ్ లు ఉండడం కూడా భారత్ కు ప్రతికూలాంశం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ టోర్నీలో భారత మహిళల జట్టు ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ కీలక క్యాచ్ లు వదిలేస్తున్నారు.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ , బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ కీలకమైన నాలుగైదు క్యాచ్‌లు వదిలేయడం వంటివి ఇప్పుడు భారత్ విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఆసీస్ పై ఫీల్డింగ్ మెరుగుపడకుంటే మాత్రం టీమిండియా ఇంటిదారి పట్టక తప్పదు.
Shafali Verma : దంచికొట్టిన షెఫాలీ..బంగ్లాను చిత్తు చేసిన భారత్





