China : రూ.2800 కోట్ల లంచం ..మరణశిక్ష..అక్కడ అవినీతికి పాల్పడితే అంతే
China : లంచాలను అరికట్టడానికి చాలా దేశాల్లో కఠినమైన చట్టాలు లేవు. కానీ చైనాలో మాత్రం లంచం తీసుకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు రుజువైతే మాత్రం మరణశిక్షనే అమలు చేస్తారు.
China
దేశం ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం మాత్రం చాలా కామన్ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ లంచాలను అరికట్టడానికి చాలా దేశాల్లో కఠినమైన చట్టాలు లేవు. కానీ చైనా(China)లో మాత్రం లంచం తీసుకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు రుజువైతే మాత్రం మరణశిక్షనే అమలు చేస్తారు.
తాజాగా భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న నేరానికి గానూ మాజీ ప్రభుత్వ సీనియర్ అధికారి యాంగ్ యూలిన్ అనే వ్యక్తికి చైనా న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 69 ఏళ్ల యాంగ్ యూలిన్, తూర్పు చైనాలోని నాంజింగ్ నగర ఆర్థిక మండలికి మాజీ వైస్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన 1993 నుంచి 2023 వరకు మూడు దశాబ్దాల పాటు వివిధ ప్రభుత్వ పదవుల్లో ఉంటూ భారీగా లంచాలు వసూలు చేశారు.
లంచాలు తీసుకోవడమే కాకుండా.. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పదవి దుర్వినియోగం, ల్యాండ్ గ్రాంట్లు, మనీల్యాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు జియాంగ్సు ప్రావిన్స్‌లోని చాంగ్జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు నిర్ధారించింది. కోర్టు ఆయన నేరాలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణించి, ఎటువంటి ఉపశమనం లేకుండా మరణశిక్షను ఖరారు చేసింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిగత ఆస్తులన్నింటినీ జప్తు చేయాలని ఆదేశించింది.
చైనా సాధారణంగా ఆర్థిక నేరాలకు మరణశిక్షలు అమలు చేయడం అరుదుగానే కనిపిస్తుంటుంది. కానీ అవినీతి తీవ్రత 1 బిలియన్ యువాన్లు దాటితే కఠిన చర్యలు తీసుకుంటోంది. చైనాలో అవినీతికి అత్యంత కఠినమైన శిక్షలు విధించడం వెనుక కమ్యూనిస్ట్ పార్టీ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం, దేశ ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని నిలబెట్టడం అనే బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలో సాగుతున్న ఈ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ వెనుక ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చూసుకోవడం ప్రధాన కారణంగా ఉంది. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ పాలన ఉంది. అవినీతి మితిమీరితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, సోవియట్ యూనియన్ లాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కూడా కూలిపోతుందని అగ్రనాయకత్వం బలంగా నమ్ముతోంది.

1989లో జరిగిన తియానన్మెన్ స్క్వేర్ నిరసనలకు ప్రజాస్వామ్యం కంటే అధికారుల అవినీతిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ప్రధాన కారణం. అందుకే ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని నిలబెట్టడానికి అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతారు.
షీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక చిన్న స్థాయి అధికారులనే కాక, అత్యున్నత స్థాయి మంత్రులు, సైనిక జనరల్స్‌ను కూడా వదలకుండా శిక్షిస్తున్నారు. చైనాలో భారీ ప్రాజెక్టులు, బ్యాంకింగ్, పరిశ్రమలు ప్రభుత్వ నియంత్రణలోనే నడుస్తుంటాయి. వందల కోట్లలో లంచాలు తీసుకునే అధికారులు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తారని భావించి, ఆర్థిక నేరాలను దేశద్రోహంగా పరిగణిస్తారు.
Siya : రహస్య పెళ్లి.. మర్డర్ కోసం రీసెర్చ్.. కేతన్ హత్య కేసులో మైండ్ బ్లాంక్ చేసే నిజాలు..





