TET : టీచర్లకు తప్పని టెట్ తిప్పలు.. మారిన సిలబస్ కొంపముంచిందా? కారణాలివేనా?
TET : పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్‌ను అందించాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉంది కాబట్టి, వారు తమ స్కిల్స్ మెరుగుపరుచుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.
TET
భావితరాలను తీర్చిదిద్దే టీచర్లే అర్హత పరీక్షలో వెనుకబడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రిజల్ట్ గవర్నమెంట్ స్కూల్స్ విద్యా ప్రమాణాల స్థాయిని ప్రశ్నార్థకంలో పడేశాయి.
తెలంగాణలో పరీక్షకు హాజరైన దాదాపు 23వేల623 మంది ప్రభుత్వ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులలో కేవలం 8వేల809 మంది మాత్రమే పాస్ కావడం గమనార్హం. అంటే ఏకంగా 14వేల814 మంది ఉపాధ్యాయులు ఈ ఎగ్జామ్‌లో ఫెయిలయ్యారు.
కేవలం 37.29 శాతం మంది టీచర్లు మాత్రమే అర్హత సాధించగా, ఉద్యోగం లేని నిరుద్యోగ కేండిడేట్స్ మాత్రం 45.66 శాతం ఉత్తీర్ణత సాధంచి.. వీరి కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు. మెయిన్‌గా రోజూ స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పే సైన్స్ టీచర్లలో 38.27 శాతం, సోషల్ స్టడీస్ బోధించే వారిలో కేవలం 24.05 శాతం మంది మాత్రమే పాస్ కావడం విద్యాశాఖను ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది.
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 2028 ఆగస్టు నాటికల్లా.. ప్రభుత్వ బడుల్లో పనిచేసే ప్రతి టీచర్ కచ్చితంగా టెట్(TET) పాస్ కావాల్సిందే. లేదంటే వారి ఉద్యోగ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం వచ్చిన రిజల్ట్‌తో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా, ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
టీచర్ల కోసం ఏటా నిర్వహించే రెండు ప్రత్యేక టెట్(TET) పరీక్షలతో పాటు సాధారణ పరీక్షలు కూడా కలిపి మొత్తం నాలుగు ఛాన్సులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.06 లక్షల మంది టీచర్లలో, ఈ ఫలితాల తర్వాత కూడా ఇంకా సుమారు 30 వేల మంది టెట్ పాస్ కావాల్సి ఉంది.
విద్యావంతులైన టీచర్లు కూడా టెట్ ఎగ్జామ్‌లో ఇలా పెద్ద సంఖ్యలో ఫెయిల్ కావడానికి వెనుక బలమైన కారణాలున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. చాలా ఏళ్లుగా తామంతా ఒకే తరగతిలో, ఒకే సబ్జెక్టు బోధించడం వల్ల ఆ అంశాలపైనే పట్టు ఉందని టీచర్లు వాదిస్తున్నారు.
కానీ టెట్(TET) పరీక్షలో సైకాలజీ, ఆధునిక విద్యా విధానాలు, ఎన్సీఈఆర్టీ (NCERT) బేస్డ్ 8వ తరగతి కంటే పై తరగతులకు చెందిన ఎన్నో స్ట్రిక్ట్ ప్రశ్నలు అడుగుతుండటంతో సమాధానాలు రాయలేకపోతున్నామని టీచర్లు చెబుతున్నారు. దశాబ్దాల క్రితం బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన సీనియర్ టీచర్లు అప్పటి పాత సిలబస్‌కే అలవాటు పడ్డారు.
ప్రస్తుతం విద్యా రంగంలోకి వచ్చిన డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ బేస్డ్ టీచింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సరికొత్త సాంకేతిక మార్పులకు అనుగుణంగా అప్డేట్ కాలేకపోవడం కూడా వారిని ఇలా వెనుకబడేలా చేస్తోందన్న వాదన వినిపిస్తోంది.

విద్యాశాఖ అధికారులు , నిపుణులు మాత్రం ఈ ఫలితాలను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నారు. కాలం మారుతున్నప్పుడు ఉపాధ్యాయులు కూడా కొత్త బోధనా పద్ధతులను, ఆధునిక గణిత విధానాలను నేర్చుకోవాలని అంటున్నారు. పిల్లలకు నాణ్యమైన ఎడ్యుకేషన్‌ను అందించాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉంది కాబట్టి, వారు తమ స్కిల్స్ మెరుగుపరుచుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.
ఇటీవలి నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS) కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో సైన్స్, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టుల్లో స్టూడెంట్స్ ప్రదర్శన చాలా బలహీనంగా ఉందని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయుల స్కిల్స్ లోపమే దీనికి మెయిన్ రీజన్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉపాధ్యాయులకు మోడర్న్ టాపిక్స్‌పై స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం, కంటిన్యూగా వారి పనితీరును సమీక్షించడం ద్వారానే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఆశించిన మార్పు తీసుకురావడం సాధ్యమవుతుంది.
Voter Registration : ఓటరు గుర్తింపు కోసం కొత్త రూల్స్..టైమ్ లేదు త్వరపడండి..





