Just SportsLatest News

T20 World Cup : వన్డే,టీ20 వరల్డ్ కప్‌లో మార్పులు..ఐసీసీ కీలక ప్రతిపాదనలు

T20 World Cup : ఐసీసీ కొత్త ప్రతిపాదన ప్రకారం 2027 వన్డే ప్రపంచకప్‌లో 14 జట్లు ఆడనున్నాయి. అంతకుముందు 2019, 2023 ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 12 ఏళ్ల తర్వాత 14 జట్లతో టోర్నీ నిర్వహించబోతున్నారు.

T20 World Cup

ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ టోర్నీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. నాలుగేళ్లకోసారి జరిగే వన్డే ప్రపంచకప్, రెండేళ్లకోసారి జరిగే టీ20 ప్రపంచకప్‌(T20 World Cup)కు అభిమానుల ఆదరణ ఓ రేంజ్‌లో ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఈ మెగాటోర్నీల్లో కొత్త మార్పులు చేస్తూ అభిమానులకు మరింత వినోదం అందించడమే లక్ష్యంగా ఐసీసీ ముందుకెళుతుంది.

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య వన్డే, టీ ట్వంటీ ప్రపంచకప్‌(T20 World Cup)లకు సంబంధించి కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పురుషుల వన్డే, టీ20 ప్రపంచకప్‌ ఫార్మాట్లలో భారీ మార్పులు చేయబోతోంది. ఇటీవల ముగిసిన ఐసీసీ సమావేశంలో దీనిపై చర్చించారు. మెగాటోర్నీల్లో పోటీ స్థాయిని పెంచి, ప్రతీ మ్యాచ్ పైనా మరింత ఆసక్తి, ప్రాధాన్యత ఉండేలా చూడడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి.

Related Articles

అభిమానులకు మరింత రసవత్తర అనుభవం అందించడమే వీటి లక్ష్యమని ఐసీసీ చెబుతోంది. ఐసీసీ కొత్త ప్రతిపాదన ప్రకారం 2027 వన్డే ప్రపంచకప్‌లో 14 జట్లు ఆడనున్నాయి. అంతకుముందు 2019, 2023 ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, 12 ఏళ్ల తర్వాత 14 జట్లతో టోర్నీ నిర్వహించబోతున్నారు.

కొత్త ఫార్మాట్‌లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు జట్లు మొదటి దశలో పోటీ పడతాయి. వీటిలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత 12 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ప్రతీ గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. రెండు గ్రూపుల నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో అత్యుత్తమంగా నిలిచిన మరో జట్టు సూపర్-7 దశకు అర్హత సాధిస్తుంది. గతంలో ఉన్న సూపర్ 6 స్థానంలో ఇప్పుడు సూపర్ 7 ఉండబోతోంది. ఈ స్టేజ్‌లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి.

మరోవైపు 2028 టీ20 ప్రపంచకప్‌లోనూ మార్పులు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో ఎప్పటిలాగే 20 జట్లు పాల్గొంటాయి. కానీ లీగ్ మరియు నాకౌట్ దశలలో కీలక మార్పులు చేశారు. గతంలో లాగా 5 జట్లతో 4 గ్రూపులు కాకుండా, ఈసారి 4 జట్లతో 5 గ్రూపులుగా విభజించారు. దీనివల్ల మొదటి రౌండ్ మ్యాచ్‌ల సంఖ్య 40 నుంచి 30కి తగ్గుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు తర్వాతి రౌండ్‌కు వెళతాయి.

T20 World Cup
T20 World Cup

గతంలో ఉన్న సూపర్ 8 స్థానంలో కొత్తగా సూపర్ 10 దశను ప్రవేశపెట్టారు. అర్హత సాధించిన 10 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. సూపర్ 10 లోని రెండు గ్రూపులలో టాపర్లుగా నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు సెమీస్ స్థానాల కోసం సరికొత్తగా ఎలిమినేటర్ రౌండ్ నిర్వహించనున్నారు. ఒక గ్రూపులో 2వ స్థానంలో ఉన్న జట్టు, మరో గ్రూపులో 3వ స్థానంలో ఉన్న జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. అందులో గెలిచిన జట్లు సెమీస్ చేరుకుంటాయి.

ఈ కొత్త మార్పులకు ఐసీసీ డెవలప్‌మెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే ఈ ఏడాది నవంబర్‌లో జరిగే ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ రివ్యూ చేసి తుది నిర్ణయం తీసుకుంటుంది.

TET : టీచర్లకు తప్పని టెట్ తిప్పలు.. మారిన సిలబస్ కొంపముంచిందా? కారణాలివేనా?

Related Articles

Back to top button