Swiggy Instamart : ఇకపై నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. నయా సేవలను మొదలుపెట్టిన స్విగ్గీ
Swiggy Instamart : సిలిండర్ల డెలివరీ బాధ్యతలను మాత్రం.. స్విగ్గీ యాప్ బాయ్స్‌కు కాకుండా, హెచ్‌పీసీఎల్ ఏజెన్సీలకు చెందిన అఫీషియల్ సిబ్బంది ద్వారానే నిర్వహిస్తారు.
Swiggy Instamart
ఇప్పటి వరకూ మొబైల్ స్క్రీన్‌పై ఒక్క క్లిక్ చేస్తే చాలు.. వేడివేడి భోజనం, నిత్యావసరాలను క్షణాల్లో తెచ్చిచ్చే స్విగ్గీ.. ఇప్పుడు ఇంట్లో వంటగ్యాస్ అయిపోతే వచ్చే ఇబ్బందులకు చెక్ పెట్టడానికి కూడా రెడీ అయింది.
ఆయిల్ సెక్టార్ దిగ్గజం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో చేతులు కలిపిన స్విగ్గీ డెలివరీ యాప్.. ఆన్-డిమాండ్ పద్ధతిలో ఎల్పీజీ సిలిండర్లను కస్టమర్ల ఇళ్లకు చేర్చే కొత్త సర్వీసులకు తెరలేపింది.
ఆర్డర్ చేసిన కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్ కస్టమర్ల ఇంటి వద్దకు వచ్చేలా డిజైన్ చేసిన ఈ సరికొత్త కాన్సెప్ట్.. దేశంలోనే మొదటిది. ప్రయోగాత్మకంగా ఈ సరికొత్త సేవలను బుధవారం అంటే జూలై 15న బెంగళూరులో అధికారికంగా లాంచ్ చేశారు.
ఇకపై గ్యాస్ సిలిండర్ కావాలనుకునే వారు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా డైరెక్టుగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్(Swiggy Instamart) అప్లికేషన్ ఓపెన్ చేసి ఎంచక్కా బుక్ చేసుకోవచ్చు. దీనిలో వినియోగదారుల కోసం 2 రకాల ఆప్షన్లను అందుబాటులో ఉంచారు. దీనిలో ఒకటి హెచ్‌పీసీఎల్‌కు చెందిన పది కిలోల బరువుండే మోడ్రన్ కంపోజిట్ సిలిండర్ అలాగే మరొకటి ఐదు కిలోల బరువుండే చిన్న సైజు మెటల్ సిలిండర్.
ముఖ్యంగా ఫైబర్ వంటి మెటీరియల్‌తో వచ్చే కంపోజిట్ సిలిండర్ ద్వారా లోపల గ్యాస్ ఎంత ఉందో కూడా మన కళ్లతో క్లియర్‌గా చూసుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ సిలిండర్లు కావాలనుకుంటే.. ముందే ఏదైనా ఏజెన్సీలో గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలనే నిబంధనలు ఏమీ లేవు.
గ్యాస్ సిలిండర్ల ట్రాన్స్పోర్ట్ ఎంతో సున్నితమైనది కాబట్టి సేఫ్టీ చర్యల విషయంలో గట్టి ఏర్పాట్లు చేశారు. ఈ సిలిండర్ల డెలివరీ బాధ్యతలను మాత్రం.. స్విగ్గీ యాప్(Swiggy Instamart) బాయ్స్‌కు కాకుండా, హెచ్‌పీసీఎల్ ఏజెన్సీలకు చెందిన అఫీషియల్ సిబ్బంది ద్వారానే నిర్వహిస్తారు.

అయితే మొదటిసారి సిలిండర్ బుక్ చేసుకునే వారి ఐడెంటిటీ ప్రూఫ్‌లను హెచ్‌పీసీఎల్ ఏజెన్సీకి చెందిన అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత నుంచి పాత సిలిండర్ ఇచ్చి కొత్తది తీసుకునే సాధారణ ఎక్స్చేంజ్ పద్ధతిని ఫాలో అవ్వొచ్చు.
పాత పద్ధతుల్లో గ్యాస్ బుక్ చేసినప్పుడు వచ్చే ఇబ్బందులను, చాలా రోజులు వేచి ఉండే సమయాన్ని దూరం చేయడమే తమ లక్ష్యమని, కస్టమర్ల సేఫ్టీకి మొదటి ప్రయారిటీ ఇస్తామని ఇన్‌స్టామార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. బెంగళూరులో మొదలైన ఈ సర్వీసులు దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఎప్పుడు విస్తరిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు.
T20 World Cup : వన్డే,టీ20 వరల్డ్ కప్‌లో మార్పులు..ఐసీసీ కీలక ప్రతిపాదనలు





