BC Reservations : బీసీ రిజర్వేషన్లపై లీగల్ వార్..హైకోర్టు తీర్పుపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..
BC Reservations : హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. బీసీ రిజర్వేషన్ల జీవోలు రద్దు కావడంపై ఏపీ ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయింది.
BC Reservations
ఏపీ పాలిటిక్స్‌లో స్థానిక సంస్థల పోరు హీట్ కాస్తా..ఇప్పుడు సుప్రీంకోర్టు స్థాయికి పాకింది. కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక పోరుపై గురువారం అక్టోబర్ 1వ తేదీన ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. వచ్చే ఆరు వారాల్లోగానే ఎన్నికల ప్రాసెస్‌ను పట్టాలెక్కించాలని ఏపీ సర్కార్‌కి , ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ తీర్పులోనే కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇస్తూ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు(Bc Reservations) కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 105, 1065 జీవోలను పూర్తిగా డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన రూల్స్ ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొంటూ ఆ రెండు జీవోలు చెల్లవని చెబుతూ వాటిని కొట్టివేసింది.
హైకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. బీసీ రిజర్వేషన్ల(Bc Reservations) జీవోలు రద్దు కావడంపై ఏపీ ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయింది. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారమే ముందుకు వెళ్లాలనే పట్టుదలతో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి నిర్ణయం తీసుకున్న కూటమి సర్కార్.. 34 శాతం కోటాను కాపాడుకోవడమే తమ మెయిన్ ఉద్దేశం అని స్పష్టం చేసింది.

ఈ పరిణామంపై స్పందించిన టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ ..బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడటానికే తాము సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అహర్నిశలు కష్టపడుతోందని, వారి డెవలప్మెంట్ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు.
సొసైటీలో అట్టడుగున ఉన్న బీసీలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టడమే తమ లక్ష్యమని, కానీ వైసీపీ నాయకులు మాత్రం బీసీలను తమ బానిసలుగానే ఉంచడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విజయ్ వివరించారు. ఏది ఏమైనా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ దక్కేలా చూస్తామని చెబుతూ ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. మరి స్థానిక పోరు సమయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి తీర్పు రానుందో చూడాలి.





