Depression: డిప్రెషన్ బలహీనత కాదు ఒక మానసిక వ్యాధి.. దానిని ఎలా జయించాలంటే?
Depression: డిప్రెషన్ ఉన్నవారు ఎంత ప్రయత్నించినా సంతోషంగా ఉండలేకపోవచ్చు. ఇది కేవలం మనసును మాత్రమే కాదు, శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Depression
రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, ఉదయం లేవగానే మనసుపై ఒక బరువైన బండరాయి ఉన్న ఫీలింగ్. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, ఇష్టమైన విషయాలు కూడా భారంగా అనిపిస్తాయి. ఇలా చాలామంది జీవితంలో అప్పుడప్పుడు అన్పిస్తుంటాయి. కానీ, ఈ ఫీలింగ్ రెండు వారాలకు మించి కొనసాగి, మీ రోజువారీ జీవితాన్ని, సంతోషాన్ని పూర్తిగా దూరం చేస్తే… అది కేవలం బాధ కాదు, అది డిప్రెషన్ అనే మానసిక వ్యాధికి సంకేతం అని తెలుసుకోవాలి.
చాలామంది డిప్రెషన్‌ని (Depression) కేవలం దుఃఖంగానో, బలహీనతగానో భావిస్తారు. కానీ నిజానికి ఇది మన మెదడులోని రసాయనాల అసమతుల్యత వల్ల వచ్చే ఒక వ్యాధి. సిరోటోనిన్, డోపమైన్ వంటి కీలకమైన హార్మోన్ల లోపం వల్ల ఇది సంభవిస్తుంది. అందుకే డిప్రెషన్ ఉన్నవారు ఎంత ప్రయత్నించినా సంతోషంగా ఉండలేకపోవచ్చు. ఇది కేవలం మనసును మాత్రమే కాదు, శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రలేమి, అధిక బరువు పెరగడం లేదా తగ్గడం, తీవ్రమైన అలసట వంటి శారీరక లక్షణాలు కూడా దీనితో ముడిపడి ఉంటాయి.
డిప్రెషన్(Depression)కు ఒకే ఒక్క కారణం ఉండదు. కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ వైఫల్యాలు లేదా ఆర్థిక ఇబ్బందులు వంటివి దీనికి కారణం కావచ్చు. కొన్నిసార్లు చిన్ననాటి చేదు అనుభవాలు, ప్రమాదాలు లేదా సన్నిహితులను కోల్పోవడం వంటి సంఘటనల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.

డిప్రెషన్(Depression)ను గుర్తించడం చాలా ముఖ్యం. కొన్ని రోజులపాటు బాధగా ఉండడం సహజం. కానీ ఈ కింది లక్షణాలు కనీసం రెండు వారాల పాటు కొనసాగితే, అది డిప్రెషన్ అని అర్థం చేసుకోవాలి.ఎప్పుడూ నిరాశగా, శూన్యంగా అనిపించడం, ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం, ఆకలి తగ్గడం లేదా విపరీతంగా పెరగడం,బాగా నిద్ర పట్టకపోవడం లేదా అధికంగా నిద్రపోవడం, శారీరక అలసట, శక్తి లేనట్లు అనిపించడం, తాను దేనికి పనికిరాననే భావన, ఏకాగ్రత లేకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం , తనకెవరూ లేరన్న ఫీలింగ్ ఎక్కవ అవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
డిప్రెషన్ జీవితంలోని అన్ని రంగాలను దెబ్బతీస్తుంది. ఇది వృత్తి, చదువు, సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. సరైన చికిత్స, సపోర్ట్‌తో డిప్రెషన్‌ను జయించొచ్చు. సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. వారు ఇచ్చే థెరపీ (ఉదాహరణకు, కగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ), అవసరమైతే మందులు ఈ సమస్యను ఓవర్ కమ్ చేయడంలో సహాయపడతాయి.
రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మెదడులో మంచి రసాయనాలు విడుదలవుతాయి.మంచి హెల్దీ ఫుడ్ తినాలి. పండ్లు, కూరగాయలు, మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ భావాలను ఓపెన్‌గా పంచుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనులు పెట్టుకొని వాటిని పూర్తి చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మైండ్ డైవర్ట్ చేసే పనులు చేయడం, కొత్త పనులు నేర్చుకోవడం, హాబీలను మెరుగుపరుచుకోవడం చేయాలి.
డిప్రెషన్ అంటే బలహీనత కాదు. ఇది ఎవరికైనా రావచ్చు. మౌనంగా బాధపడకుండా, సరైన సహాయం కోరితే, జీవితాన్ని తిరిగి ఆనందంగా, పూర్తి శక్తితో గడపవచ్చు.