Yoga: సింపుల్ యోగా..ఆరోగ్యం,మనశ్శాంతి మీ ఫింగర్స్‌లోనే..
Yoga: చేతి వేళ్లలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని ఉపయోగించి, రోగాలను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Yoga
పని ఒత్తిడి, వేగవంతమైన జీవితం.. వీటి వల్ల చాలామంది యోగా చేయడం, వ్యాయామం చేయడం లాంటివి మానేస్తున్నారు. సమయం లేక, లేదా ఆసక్తి లేక.. ఏదో ఒక కారణం చెబుతుంటారు. కానీ, ఇప్పుడు మీ చేతి వేళ్లతోనే ఆరోగ్యాన్ని సాధించవచ్చు. మీ చేతి వేళ్లలో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని ఉపయోగించి, రోగాలను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా(Yoga) ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం కేటాయించి యోగా చేస్తారు. కానీ మన చేతి వేళ్లతో చాలా సులభంగా, ఎప్పుడైనా యోగా సాధన చేయవచ్చు. మన వేళ్ళలో శరీరంలోని అన్ని నాడులకు కేంద్ర స్థానాలు ఉంటాయి.
జ్ఞాన ముద్ర: చూపుడు వేలు, బొటన వేలు కొనలను కలపాలి. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. నిద్రలేమి, కోపాన్ని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
ప్రాణ ముద్ర: ఉంగరం వేలు, చిటికెన వేలును బొటన వేలితో కలపాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలో చురుకుదనాన్ని తీసుకొస్తుంది.
అపాన ముద్ర: మధ్య వేలు, ఉంగరం వేళ్లను బొటన వేలితో జతచేయాలి. ఈ ముద్ర శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించి, మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
పృథ్వీ ముద్ర: ఉంగరం వేలు, బొటన వేలు కొనలను కలపాలి. ఈ ముద్ర శరీర బలహీనతను పోగొట్టి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఎముకలు, కండరాలను బలంగా మార్చుతుంది.
వరుణ ముద్ర: చిటికెన వేలు, బొటన వేలును కలిపితే ఈ ముద్ర ఏర్పడుతుంది. దీన్నే జల ముద్ర అని కూడా అంటారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేసి, కండరాలు ముడుచుకుపోకుండా చేస్తుంది.

అగ్ని ముద్ర: బొటన వేలితో ఉంగరం వేలి మధ్య భాగాన్ని అదిమి పట్టాలి. ఇది శరీర బరువును తగ్గించి, కొవ్వును కరిగిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
వాయు ముద్ర: చూపుడు వేలు మధ్య భాగాన్ని బొటన వేలితో అదిమి పట్టాలి. ఇది శరీరంలోని వృథా వాయువులను బయటకు పంపుతుంది. గ్యాస్, ఛాతీ నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
శూన్య ముద్ర: మధ్య వేలు మధ్య భాగాన్ని బొటన వేలితో అదిమి పట్టుకోవాలి. ఇది చెవి సంబంధిత సమస్యలను నివారిస్తుంది. బద్ధకాన్ని పోగొట్టి, చురుకుగా ఉంచుతుంది.
లింగ ముద్ర: అన్ని వేళ్లను ఒకదానితో ఒకటి పెనవేసి కుడి చేతి బొటన వేలు మాత్రం పైకి ఉంచాలి. ఇది రోగాలను దూరం చేసి, శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది.