swimming pool: స్విమ్మింగ్ పూల్ అడుగున అద్భుత ప్రపంచం..అస్సలు మిస్ అవ్వొద్దు
Swimming pool: డీప్ డైవ్ దుబాయ్ కేవలం పూల్ కాదు.. ఒక అద్భుతమైన జల ప్రపంచం.

Swimming pool
ఒక స్విమ్మింగ్ పూల్(Swimming pool) అంటే… కొన్ని అడుగుల లోతు ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే అత్యంత లోతైన పూల్ గురించి మీకు తెలుసా? అదే ..డీప్ డైవ్ దుబాయ్. ఇది కేవలం పూల్ కాదు.. ఒక అద్భుతమైన జల ప్రపంచం. దీని లోపల ఒక మునిగిపోయిన నగరం ఉంది. ఈ పూల్ లోతు 60.2 మీటర్లు అంటే 196 అడుగులు. అందుకే ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.
డీప్ డైవ్ దుబాయ్ లోని ప్రధాన ఆకర్షణ దాని లోతు మాత్రమే కాదు. పూల్ లోపల ఒక మునిగిపోయిన, నిర్మానుష్యమైన నగరం (abandoned sunken city) ఉంది. అపార్ట్మెంట్లు, గ్యారేజీలు, వీధులు, గోడలపై గ్రాఫిటీ.. ఇలా ఒక పట్టణం ఎలా ఉంటుందో అచ్చం అలాగే దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ స్కూబా డైవింగ్, ఫ్రీడైవింగ్ చేస్తూ ఈ నగరంలో ప్రయాణించొచ్చు.
ఈ పూల్(Swimming pool)లో డైవ్ చేసేవారికి పూర్తి భద్రత కల్పిస్తారు. నిపుణులైన డైవర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అలాగే, ఇక్కడ నీటి అడుగున ఒక మాయా ప్రపంచం లాంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రత్యేక మూడ్ లైటింగ్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.

ఈ పూల్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం 56 అండర్‌వాటర్ కెమెరాలు పూల్ లోపలి ప్రతి మూలనూ పర్యవేక్షిస్తాయి. పూల్‌లోని నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రతి 6 గంటలకు ఒకసారి నాసా సాంకేతికతను ఉపయోగించి నీటిని ఫిల్టర్ చేస్తారు. దీనివల్ల నీరు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రతను 30°C వద్ద నిర్వహిస్తారు. అందుకే డైవ్ చేసేవారు వెట్ సూట్ లేకుండానే ఈత కొట్టవచ్చు.
డైవింగ్ అనుభవం లేనివారు కూడా ఇక్కడ ఆస్వాదించొచ్చు. ట్రైనింగ్ తీసుకుని డిస్కవర్ స్కూబా డైవింగ్ వంటి కోర్సుల్లో పాల్గొనొచ్చు. 10 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఇక్కడ డైవ్ చేయవచ్చు. పూల్ పక్కనే 80 సీట్ల రెస్టారెంట్, డైవ్ షాపు, వర్క్‌షాప్‌ల వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే కాదు.. ఒక ఇంజినీరింగ్ అద్భుతం. ఈ ప్రదేశం అడ్వెంచర్ ఇష్టపడేవారికి, డైవింగ్ ప్రియులకు ఒక కలల ప్రపంచం లాంటిది.