ISRO:ఇస్రో కొత్త ప్రయోగం.. చంద్రయాన్-4లో రోబో, ఏఐ టెక్నాలజీ
ISRO :చంద్రయాన్-4 మిషన్ విజయవంతమైతే, అది భారతదేశానికి భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఒక బలమైన పునాది అవుతుంది.

Innovative Applications of AI in Lunar Exploration
ISRO భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదే చంద్రయాన్-4 మిషన్. ఈ మిషన్‌లో భాగంగా, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , రోబోటిక్స్ సాంకేతికతను ఉపయోగించి చంద్రుని ఉపరితలం నుంచి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది భారత అంతరిక్ష యాన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది.
చంద్రయాన్-4 మిషన్ చాలా క్లిష్టమైనదే కాకుండా బహుళ-దశల ప్రణాళికతో కూడుకున్నది. ఈ ప్రాజెక్ట్‌లో రెండు వేర్వేరు రాకెట్లు (LVM3 ,PSLV) ద్వారా మొత్తం ఐదు మాడ్యూల్స్‌ను చంద్రుని వైపు పంపిస్తారు. ఇందులో ఒక ముఖ్యమైన మాడ్యూల్ రోబోటిక్ శాంప్లింగ్ ఆర్మ్ కలిగి ఉంటుంది. ఈ ఆర్మ్ ఏఐ ఆధారితంగా పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై నుంచి దాదాపు 2-3 కిలోల రిజోలిత్ (చంద్రుని మట్టి)ను సేకరిస్తుంది. సేకరించిన నమూనాలను వాక్యూమ్-సీల్డ్ కంటైనర్లలో భద్రపరిచి, తిరిగి భూమికి తీసుకురావడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన భాగం, మాడ్యూల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే (docking) , నమూనాలను బదిలీ చేసే స్వయంప్రతిపత్తి కలిగిన సాంకేతికత.
చంద్రయాన్-4 మిషన్ విజయవంతమైతే, అది భారతదేశానికి భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఒక బలమైన పునాది అవుతుంది. ఈ ప్రయోగంలో నేర్చుకున్న టెక్నాలజీలు, ముఖ్యంగా ఏఐ ఆధారిత విజన్-బేస్డ్ నావిగేషన్ మరియు డాకింగ్ సిస్టమ్స్, భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు చాలా అవసరం. ఇస్రో ప్రస్తుతం చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో కూడా ఈ టెక్నాలజీలను పరీక్షించనున్నారు. డిసెంబర్ 2025లో ఇస్రో మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌కు ముందు ఒక మానవరహిత ప్రయోగాన్ని నిర్వహించనుంది. ఇందులో మానవ రూపంలో ఉండే రోబో ‘వయోమిత్ర’ను పంపి, మానవ శరీర కదలికలు , శారీరక స్పందనలను అధ్యయనం చేస్తారు. ‘వయోమిత్ర’ అనేది ఒక మాటలకు స్పందించే, శారీరక డేటాను సేకరించగల రోబో, ఇది వ్యోమగాముల భద్రతను నిర్ధారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌ల విజయం భారతదేశం యొక్క అంతరిక్ష శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, 2040 నాటికి మానవ సహిత లూనార్ మిషన్ మరియు భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు వంటి లక్ష్యాలకు పునాది వేస్తుంది.
Bigg Boss :పవన్ కొత్త కెప్టెన్, ప్రియ, శ్రీజల గ్రూప్ గేమ్..బిగ్ బాస్ ఇంటిలో కొత్త రాజకీయాలు