Pakistan :మరోసారి చిరకాల ప్రత్యర్థుల పోరు..ఈ సారైనా పాక్ పోటీ ఇస్తుందా ?
Pakistan :సూపర్-4 స్టేజ్ లో భారత్, పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది.

Pakistan
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరం ఆసియాకప్ స్టార్ట్ అయి వారం రోజులు దాటినా అసలైన మజా రాలేదు. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లన్నీ వన్ సైడ్ గా ముగిసిపోవడమే దీనికి కారణం. కొన్ని చిన్న జట్లు కూడా టోర్నీలో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్థాన్ లీగ్ స్టేజ్ లో వన్ సైట్ విక్టరీ కొట్టేశాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్(Pakistan) మధ్య మ్యాచ్ కూడా ఏకపక్షంగానే ముగిసింది. చాలా రోజుల తర్వాత ఇరు జట్లు తలపడడంతో హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే పాక్ జట్టు చెత్త ఆటతీరుతో భారత్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇండియా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు పాక్ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. ఆ టీమ్ బౌలింగ్ కూడా అనుకున్నంత గొప్పగా ఏం లేకపోవడంతో భారత్ చాలా ఈజీగా గెలిచేసింది. అయితే సూపర్-4 స్టేజ్ లో భారత్, పాక్ జట్లు మరోసారి తలపడబోతున్నాయి.
ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఎప్పటిలానే టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే పాకిస్తాన్ (Pakistan) కనీస పోటీ ఇస్తుందా అన్న చర్చ మొదలైంది. అయితే లీగ్ స్టేజ్ మ్యాచ్ తర్వాత పాక్ క్రికెటర్లకు మనోళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగానే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్ ఐసీసీకి ఫిర్యాదు చేసి నానా రచ్చ చేసింది. అయినప్పటకీ ఐసీసీ పాక్ ను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక టోర్నీలో ఆడేందుకే పాక్ నిర్ణయించుకుంది. ఇప్పుడు భారత్ నుంచి మరోసారి పాక్ జట్టుకు అవమానం తప్పకపోవచ్చు. ఈ సారి మాత్రమే కాదు టోర్నీ ముగిసే వరకూ నో షేక్ హ్యాండ్ పాలసీనే టీమిండియా కంటిన్యూ చేయనుంది.
ఇదిలా ఉంటే భారత్ అన్ని విభాగాల్లోనూ మంచి ఫామ్ లో ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లీగ్ స్టేజ్ లో పాక్(Pakistan) పై దుమ్మురేపారు. అభిషేక్ శర్మ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. అటు సూర్యకుమార్ పాక్ తన పేలవ రికార్డుకు ముగింపు పలికాడు. మిగిలిన బ్యాటర్లలో హర్థిక్ , సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా చెలరేగితే పాక్ బౌలర్లకు ఇక చుక్కలే. మరోవైపు బౌలింగ్ లో బుమ్రాకు తోడుగా శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నారు. బుమ్రాతో బంతిని పంచుకుంటున్న హార్థిక్ ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నాడు. అటు దూబే కూడా బాల్ తో సత్తా చాటుతున్నాడు. ఇక స్పిన్ విభాగంలో టీమిండియాకు తిరుగే లేకుండా పోయింది. కుల్దీప్ యాదవ్ ఒంటి చేత్తో మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. అతనికి తోడుగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నారు. పాక్ పై భారత తుది జట్టులో మార్పులు జరగకపోవచ్చు.
ఇక పాకిస్థాన్(Pakistan) జట్టు ఇప్పటి వరకూ పెద్దగా ఆడిందేమీ లేదు. చిన్న జట్లపై గెలిచి సూపర్ 4కు వచ్చిన పాక్ ను ఒక్కోసారి తక్కువ అంచనా వేయలేం. కానీ ఆ జట్టు ప్రధాన బ్యాటర్లు పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నారు. ఓపెనర్ సయీమ్ అయూబ్ పై భారీ అంచనాలుండగా.. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ డకౌటయ్యాడు. అలాగే మిగిలిన బ్యాటర్లలోనూ ఎవ్వరూ రాణించడం లేదు. బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాక్ జట్టు సూపర్ 4 స్టేజ్ లోనైనా భారత్ కు గట్టిపోటీనిస్తుందా అనేది వేచి చూడాలి.
One Comment