Car-free cities: నార్వే,నెదర్లాండ్స్ కారు లేని నగరాలుగా ఎలా మారాయి?
Car-free cities: నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో వ్యక్తిగత కార్లను అనుమతించకుండా, కేవలం ప్రజారవాణా, సైకిళ్లు , ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించడాన్ని కారు ఫ్రీ సిటీ అంటారు .

Car-free cities
ప్రపంచమంతా పట్టణీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో, నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా, ప్రపంచంలోని కొన్ని దేశాలు ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. అదే “కార్ ఫ్రీ సిటీ” (Car Free City). అంటే, నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో వ్యక్తిగత కార్లను అనుమతించకుండా, కేవలం ప్రజారవాణా, సైకిళ్లు , ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించడం.
కారు ఫ్రీ సిటీ(car-free cities)లుగా అమలుచేస్తే..కారుల నుంచి వచ్చే పొగ, శబ్దం తగ్గిపోతాయి. దీనివల్ల వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది.కార్లు లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదు. ప్రజలు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.
సైకిళ్లు ఉపయోగించడం వల్ల ప్రజలు శారీరకంగా చురుగ్గా ఉంటారు. నగరాల్లోని రోడ్లు ప్రజలు నడవడానికి సురక్షితంగా, అనుకూలంగా మారతాయి. కార్లు లేకపోవడం వల్ల ఖాళీగా ఉన్న స్థలాలను పార్కులు, గ్రీన్ స్పేస్‌లు, మరియు ఆట స్థలాలుగా మార్చవచ్చు.

ఈ ఆలోచన వినడానికి బాగున్నా కూడా, దీనిని అమలు చేయడం అంత సులభం కాదు. కొన్ని సవాళ్లు ఉన్నాయి.అన్ని నగరాల్లో పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థ లేదు. బస్సులు, మెట్రోలు వంటివి లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు.అంబులెన్స్, అగ్నిమాపక దళం వంటి అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగవచ్చు.ప్రధాన మార్కెట్‌లలో కార్లు లేకపోవడం వల్ల వ్యాపారాలు దెబ్బతినవచ్చు.ప్రజలు కార్లను వ్యక్తిగత స్వాతంత్య్రానికి ,ప్రతిష్టకు చిహ్నంగా, భావిస్తారు. ఈ ఆలోచనను ఆమోదించడం వారికి కష్టం కావచ్చు.
ప్రపంచంలో ఇప్పటికే కొన్ని నగరాలు ఈ ఆలోచనను అమలు చేస్తున్నాయి.
ఒస్లో, నార్వే.. ఒస్లోలో నగర కేంద్రంలో కార్లను నిషేధించారు. పాత పార్కింగ్ స్థలాలను సైకిల్ మార్గాలుగా, పార్కులుగా మార్చారు.
ఆమ్ స్టర్ డామ్, నెదర్లాండ్స్.. ఈ నగరం సైకిల్స్ కు స్వర్గధామంగా ఉంది. ప్రజలు కార్ల కంటే సైకిల్స్ నే ఎక్కువగా వాడతారు.
పారిస్, ఫ్రాన్స్.. పారిస్ నగరం కూడా కార్ల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా నగర కేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది.
ఈ ఆలోచన భారతదేశం వంటి దేశాలకు ఒక మంచి పాఠం. మనం ఈ విదేశీ నగరాల నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం, సైకిల్ ట్రాక్‌లను నిర్మించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మనం కూడా భవిష్యత్తులో “కార్ ఫ్రీ సిటీ”ల వైపు అడుగులు వేయొచ్చు.
2 Comments